అది ప్రేమకాదు మానసిక రుగ్మత!

వ్యధ: మానసిక సమస్యలకు పరిష్కార వేదిక

It's not love is a mental disorder
strain

ఇప్పటి తరం అమ్మాయిల్లో కొందరి ప్రవర్తన దారుణంగా ఉంది. వారిని ప్రేమో, పిచ్చో, ఉన్మాదమో అర్ధం కాకుండా పోతోంది.

కొంతమంది అమ్మాయిలు 12 నుంచి 15 యేళ్లకు మధ్యలోనే ప్రేమలో పడుతున్నారు. లోకం తీరు సరిగా అర్ధంకాని వయసులోనే మనసు, వ్యక్తిత్వం, స్వేచ్ఛ లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మందలిస్తే తిరగబడుతున్నారు.

కొట్టి, తిట్టే ప్రయత్నం చేస్తే కేసులు పెట్టడానికి కూడ వెనుకాడటం లేదు. తల్లి, తండ్రి కంటే ప్రేమించినవాడే ముఖ్యమని వాదిస్తున్నారు.

పోనీ వారు తగిన వ్యక్తినైనా ప్రేమించారా? అంటే అదీ లేదు. వయస్సు, కుటుంబనేపథ్యం, వ్యక్తి ప్రవర్తనతో సంబంధం లేకుండా ప్రేమలో పడుతున్నారు.

ఇలాంటివి చూసినపుడు తెలిసీ తెలియని అమ్మాయిలను మందుపెట్టి లేదా మాయచేసి వశం చేసుకున్నారా అనిపిస్తుంది.

కొంతమంది అయితే హిప్నాటిజం నేర్చుకుని అమ్మాయిలను బుట్టలో వేసుకుంటారని అంటున్నారు.

మా అమ్మాయి ప్రవర్తన చూస్తే ఇలాంటి వన్నీ నిజమనిపిస్తుంది. అయితే ఏది న మ్మాలో ఏమి చేయాలో అర్ధం కాకుండా ఉంది.

మాకు ఒక్కతే అమ్మాయి ఎనిమిదవ తరగతి పాసై తొమ్మిదిలోకి వచ్చింది. వయసు 14 యేళ్లు.

అయితే ఎత్తు, లావ్ఞ, బరువ్ఞను బట్టి 18 యేళ్లు నిండిన దానిలా కనిపిస్తుంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా స్కూలు లేకపోవడంతో ఇంట్లోనే ఉంటోంది.

మాది మధ్య తరగతి కుటుంబం. మాకొక కిరాణా కొట్టు ఉంది. నేను, మా వారికి తోడుగా షాపులోనే ఉంటాను.

ఇంట్లో కతే ఉంటే బోరుగా ఉంటుందని పైగా బరువ్ఞ పెరుగుతుందని తలచి మా అమ్మాయిని రోజు సాయంత్రం వాకింగ్‌కు వెళ్లమని చెప్పాము. అక్కడ ఒక వ్యక్తితో పరిచయం పెంచుకున్నది. అతనికి 32 యేళ్లు. రెవెన్యూ డిపార్ట్‌మెంటులో పనిచేస్తున్నాడు.

అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

గుడిలో ఇద్దరు ప్రమాణాలు కూడా చేసుకున్నారు. అమ్మాయి మైనర్‌ కాబట్టి ఇప్పుడే పెళ్లి చేసుకుంటే కేసులు గొడవలు వస్తాయని, ఉద్యోగం పోతుందని ఆమెకు చెప్పాడు.

అలాగే ఒక భార్య ఉండగా రెండవ పెళ్లికి చట్టం ఒప్పుకోదని తెలిపాడు. అయితే ఇద్దరం కలసి సహజీవనం చేసినా తప్పుకాదని అమ్మయిని నమ్మించాడు.

మేము లేనప్పుడు ఇంటికి రావడం, అమ్మాయిని ద్విచక్రవాహనంలో తీసుకుని వెళ్లి తిరగడం ప్రారంభించాడు.

చూసిన వారు చెప్పడంతో మా వారు కాపు కాసి, వెంటపడి పట్టుకున్నాడు. అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి మందలించారు. దానికి అమ్మాయి దురుసుగా సమాధానం చెప్పింది.

తన జీవితం తనిష్టమని ఎదురు చెప్పింది.

ఒక భార్య ఉండగా రెండవ పెళ్లికి చట్టం ఒప్పుకోదని చెఇపతే, అతను మొదటి భార్యకు విడాకులు ఇచ్చి, తనను చేసుకుంటాడని నమ్మకంగా చెప్పింది.

దాంతో విధిలేక పోలీసులను ఆశ్రయించాము. వారు అ అబ్బాయిని పిలిపించి మందలించారు.

దానికి అతను మా అమ్మాయిదే తప్పని, తన వెంటబడిందని కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. అమ్మాయిని తానే మీ మాయ చేయలేదని ఆమెను మార్చుకుంటే తనకు అభ్యంతరం లేదని చెప్పాడు.

ఇక మీదట ఆమె జోలికి రాని ఎస్‌.ఐ సమక్షంలో రాత మూలకంగా హామీ ఇచ్చాడు. అయితే మా అమ్మాయిలో మాత్రం మార్పు రాలేదు.

తాను చదువు పూర్తయిన తరువాత అతన్నే పెళ్లి చేసుకుంటానని వాదిస్తోంది.

మాతో మొండిగా వ్యహరిస్తోంది. ఒక్కోసారి తన జీవితాన్ని నాశనం చేస్తున్నామంటూ గొడవ చేస్తున్నది. ఆమె చిన్నతనం నుంచి అందరితో కలసిపోయే స్వభావి.

సులభంగా ఎవరితోనైనా కలసిపోతుంది. అందరినీ నమ్మేస్తుంది. అన్ని విషయాలలో చురుగ్గా ఉంటుంది. అయినప్పటికీ భోజనం, స్నానం మాత్రం అర్ధగంటపైగా చేస్తుంది.

ఈ నేపథ్యంలో ఆమె మానసిక స్థితి, ప్రవర్తన ఎలా మార్చాలో తెలుపగలరు. – సుమతి

అమ్మా! మీ అమ్మాయిది ప్రేమకాదు. ఆమెలో హార్మోన్ల అసమతుల్యత వల్ల మానసిక రుగ్మతలు తలెత్తినట్లు ఉంది.

.ప్రతి అపరిపక్వ వ్యామోహపు చర్యను ప్రేమగా భావించడానికి కుదరదు. చాలా సందర్భాలలో ప్రేమ, వ్యామోహం, ఉన్మాదం మధ్య తేడాలను చెప్పినా కొందరు సమ్మతించరు.

వితండవాదం చేసి తమది నిజమైన ప్రేమ అంటు నమ్మించేందుకు తీవ్రస్థాయిలో వాదిస్తారు. అలాంటి వారిని కౌన్సిలింగ్‌ ద్వారా మార్చడం కూడా కష్టమవుతుంది.

ఆలోచనలు, దృక్పథంలోని ప్రతికూలతలను కౌన్సిలింగ్‌ ద్వారా సరిదిద్దవచ్చు.

ఒకవేళ తాము చేస్తున్నది తప్పని తెలిసి మారడానికి మార్గాలు చూపమనే వారిని మాటలు చెప్పి మార్చవచ్చు.

అయితే హార్మోన్ల లోపం, రుగ్మతలు తీవ్రమైన వ్యామోహం లేదా ఉన్మాదం (సెక్స్‌ మ్యానియా) ఉన్నప్పుడు మాత్రం సైకియాట్రిస్టు ద్వారా చికిత్స చేయిస్తూ, వారి అనుమతితో కౌన్సిలింగ్‌ చేయించడం మంచిది.

ఒక మీ అమ్మాయి వ్యవహారం పరిశీలిస్తే ఆమెలో ప్రేమోన్మాదం ఉన్నట్లు భావించాలి.

ఇక్కడ ఉన్మాదం అంటే వివేకరహిత విపరీత ప్రవర్తనగా అర్ధం చేసుకోవాలి.

దీనికి హార్మోన్లు అతిగా స్రవించడం ఒక కారణం కావచ్చు.

లేదా పరిసరాల ప్రభావం వల్ల హార్మోన్లు అతిగా స్పందింస్తుండవచ్చు. సాధారనంగా వయస్సు వచ్చిన అబ్బాయిలు, అమ్మాయిల్లో ఆకర్షణలు, ఆలోచనలు ఉంటాయి.

అయితే విలువలు, సామాజిక పద్ధతుల వల్ల వాటిని నియంత్రించుకుంటుంటారు. హార్మోన్లు అతిగా స్పందించినపుడు ఆలోచనల నియంత్రణ కోల్పోయి దారి తప్పుతుంటాయి.

కాగా మీ అమ్మాయి భోజనం, స్నానం ఎక్కువ సమయం చేస్తున్నదంటే ఒసిడి (అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌) ఉండవచ్చని భావించాల్సి ఉంది.

ఈ సమస్య ఉన్న వారికి వద్దనుకున్నా అవే ఆలోచనలు వస్తుంటాయి. చేసిన పనే చేయాలనిపిస్తుంటుంది. కాబట్టి మీ అమ్మాయిలో వ్యామోహం, ఒసిడి లక్షణాలు తగ్గించాలి.

ఆమెది ప్రేమ కాదని, మానసిక రుగ్మతగా గుర్తించి, చికిత్స, కౌన్సిలింగ్‌ చేయించండి.

పూర్తిగా నయమై దారిలోకి వస్తుంది.

-డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/