ఇది మా మొదటి విజయం.. వైఎస్ షర్మిల

బాధితుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామనడం మా తొలి విజయం
ఉద్యోగాలు వచ్చేవరకు రాజీలేని పోరాటం

నేరేడుచర్ల: తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని మేడారం గ్రామానికి చెందిన యువకుడు నీలకంఠం సాయి ఇటీవల ఆత్మహత్యాయత్నం చేశాడు. తెలంగాణలో ఉద్యోగ నోటిషికేషన్ల విడుదల కోసం పోరాడుతున్న వైఎస్ షర్మిల ఆ విషయం తెలిసి పరామర్శించేందుకు నిన్న వెళ్లారు. అయితే, యువకుడి ఇంటికి తాళం వేసి ఉండడంతో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తనను కలవ వద్దని టీఆర్ఎస్ నేతలు బాధిత యువకుడి కుటుంబాన్ని బెదిరించారని ఆరోపించారు.

అయినప్పటికీ వారు వినకపోవడంతో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఆ కుటుంబాన్ని ఎక్కడికో తరలించారని ఆరోపించారు. తాము వస్తున్నామనే భయంతో ప్రభుత్వం నీలకంఠం సాయికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడం సంతోషకరమైన విషయమని, తాము చేస్తున్న పోరాటంలో ఇది తొలి విజయమని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 1200 మంది ప్రాణత్యాగం చేశారని, వారి కుటుంబాలను ఆదుకుంటామన్న కేసీఆర్ ఆ తర్వాత ఆ ఊసే మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చింతలపాడు మండలంలోని దొండపాడు వెళ్లి ఇటీవల కరోనాతో మృతి చెందిన వైస్సార్సీపీ నేత, ఏపీ బేవరేజెస్ కోఆర్డినేటర్ గున్నం నాగిరెడ్డి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/