ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలి : కిషన్ రెడ్డి

మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కితీసుకుంటే మంచిదే

ముంబయి: రాష్ట్ర ప్రజల సెంటిమెంటును అర్థం చేసుకుని మూడు రాజధానుల నిర్ణయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ వెనక్క తీసుకుంటే మంచిదేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం పాలకులపై ఉంటుందని చెప్పారు. మరోవైపు సీఎం కేసీఆర్ పై ఆయన మండిపడ్డారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిచేందుకు కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేసినా ఓటమిపాలయ్యారని చెప్పారు. డబ్బులు పంచారని, ఇతర పార్టీల నేతలను కొన్నారని అయినా టీఆర్ఎస్ ఓడిపోయిందని అన్నారు. ఓటర్లను ఎన్నో ప్రలోభాలకు గురిచేసినా అపజయాన్ని మూటకట్టుకున్నారని చెప్పారు.

ప్రభుత్వ యంత్రాంగం మొత్తం హుజూరాబాద్ లో మోహరించిందని.. రాష్ట్ర సచివాలయం మొత్తం హుజూరాబాద్ లోనే ఉందా అనే విధంగా పని చేశారని కిషన్ రెడ్డి విమర్శించారు. దళితులు సీఎం అయితే రాష్ట్రం అభివృద్ధి చెందదు అనే విధంగా కేసీఆర్ గతంలో మాట్లాడారని మండిపడ్డారు. దళితులు సీఎం పదవికి పనికిరారా? అని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఓటమి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వడ్డు, బియ్యం కొనుగోలుపై కొత్త నాటకాన్ని మొదలుపెట్టారని అన్నారు. బాయిల్డ్ రైస్ మినహా అన్నింటినీ కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని తెలిపారు. కేసీఆర్ కుటుంబం అబద్ధాలతో రాజకీయం చేస్తోందని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/