తెదేపా నేతల్లో కలకలం సృష్టిస్తున్న ఐటి దాడులు

IT
IT

తెదేపా నేతల్లో కలకలం సృష్టిస్తున్న   ఐటి దాడులు

-పలువురు ప్రముఖుల ఖాతాలు సేకరణ
-అమరావతి రాజధాని ప్రాంతంలో ఐటి నిఘా
-నారాయణ విద్యాసంస్థల్లో రహస్య తనిఖీలు
-అందుబాటులో ఉన్న మంత్రులతో సిఎం సమీక్ష
-కక్షతో వ్యవహరిస్తున్న కేంద్రం: తెదేపా నేతల ఆరోపణ

గుంటూరు ప్రభాతవార్త ప్రతినిధి

తెలంగాణా రాష్ట్రంలో పలువురు రాజకీయ నేతలను హడెలెత్తించిన ఐటీ అధికారులు ఇపుపడు ఆంధ్రప్రదేశ్‌పై కన్నేశారు.విస్త్రుృతంగా దాడులు చేసేందుకు వ్యూహం పన్నుతున్నారు. ఇప్పటికే ఏపికి చెందిన పలువురు అధికారపార్టీ నాయకులు,ఎమ్మెల్యేలు,మంత్రుల ఆదాయాలకు సంబంధించి వివరాలు సేకరించే పనుల్లో ఐటీ అధికారులు నిమ్నగ్నమయ్యారు.ముఖ్యంగా అమరావతి రాజధాని కేంద్రీకృతమై ఉన్న విజయవాడ,గుంటూరు నగరాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రముఖుల బ్యాంకు లావాదేవీల వివరాలను సేకరించి ఐటీ అధికారులు దాడులు చేసేందుకు సిబ్బందిని రంగంలోకి దించారు.అమరావతి రాజధాని ప్రాంతంలో భారీగా దాడులు,సోదాలు జరిపేందుకు ఐటీ ఆశాఖాధికారులు సిద్దంగా ఉన్నారు. ఇందులో భాగంగా మొదటగా మంత్రి నారాయణ ఆస్తులు,విద్యాసంస్థల్లో ఐటీ సోదాలు మొదలయ్యాయి. అయితే ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం,శుక్రవారం మంత్రి నారాయణకు చెందిన కాలేజీలకు చేరుకున్న ఐటీ అధికారులు అత్యంత గోప్యంగా విజయవాడు,గుంటూరు,నుంచి వచ్చిన ఐటీ అధికారులు పోలీస్‌ భద్రత మధ్య సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే నారాయణ కళాశాల సిబ్బంది మాత్రం అదేమి లేదని ఖండిస్తున్నారు.

ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయమే విజయవాడలో ఉన్న ఆటోనగర్‌లోని ఆఫీసులో సమావేశమైన ఐటీ అధికారులు సోదాలపై కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది.తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు ప్రముఖులపై ఐటీ దాడులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలోని కృష్ణా,గుంటూరు జిల్లాల్లో టీడీపీకి చెందిన ప్రముఖులు,వ్యాపారవేత్తలు,కాంట్రాక్టర్లపై ఒక్కసారిగా విరుచుకుపడేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం. ఇందు కోసం హైదరాబాద్‌,బెంగుళూరు,చెన్నైనుంచి పెద్ద సంఖ్యలో ఐటీ సిబ్బంది ఈ ప్రాంతానికి చేరుకున్నట్లు చెబుతున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా సోదాలు జరిపేందుకు వీలుగా తగిని బందోబస్తు ఏర్పాటు చేయాలని స్థానిక పోలీస్‌ యంత్రాంగాన్ని ఐటీ అధికారులు కోరినట్లు తెలిసింది.అరగంట ముందు చెబుతాం.. ఆ వెంటనే తమతో పాటు కలిసి రావాలని, బందోబస్తు కల్పించాలని అడిగినట్లు సమాచారం.నిజానికి టీడీపీకి సన్నిహితంగా ఉండే ప్రముఖులపై ఐటీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

రెండు,మూడు నెలలుగా అమరావతి ప్రాంతంపై ఐటీ కన్నేసింది. సోదాలకు అవసరమైన యంత్రాంగాన్ని సిద్దం చేసుకుంటోంది. రాజధాని ప్రాంతంలో భూ లావాదేవీలు జరిపినా,పన్నులు కట్టలేదని భావిస్తున్న కాంట్రాక్టర్లు, వ్యాపారవెత్తలతో ఒక కీలకమైన జాబితా రూపొందించుకున్నారని చెబుతున్నారు. ఇందులో నలుగురు ప్రముఖ ప్రజాప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణాలో రేవంత్‌రెడ్డి ఇంట్లో జరిగిన ఐటీ దాడులు రాజకీయంగా వేడిని పెంచాయి. రాజకీయ కక్షతోనే టీఆర్‌ఎస్‌,బిజేపి,కలిసి దాడులు చేయించారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ఎదుర్కొనలేక దాడులతో భయపెట్టాలని చూస్తున్నారని విమర్శలు చేస్తున్నారు

.హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి అంశానికి కొనసాగింపుగా అమరావతిలో సోదాలు జరుపుతారా? లేక దానికి దీనికి సంబంధం లేదా? అనే అంశంపై స్పష్టత లేదు. టీడీపి చుక్కలు చూపిస్తామని ఒకరిద్దరు బిజేపి నేతలు గతంలో హెచ్చరించారు. ఎన్నికల ముందు రాజకీయ ప్రత్యర్థులపైకీ ఐటీ ,ఈడి వంటి సంస్థలను ప్రయోగించటం ప్రధాని మోడీకి అలవాటని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరుచూ చెబుతున్నారు.ఈ పరిణామాల మధ్య ఆపరేషన్‌ ఐటీ రాజకీయంగా ఉత్కంఠ రేకెత్తిసోంది.అయితే ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని ముందు నుంచే చెబుతున్నామని టీడీపి వర్గాలు అంటున్నాయి. మోదీ ప్రభుత్వం తమపై రాజకీయ కక్షతో దాడులు చేయించే అవకాశం ఉందని అంటున్నారు. బాబ్లీపోరాటంలో చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంలో కూడా కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు.

ఏపీలో ఏం జరుగుతోంది….

ఏపీలో అధికారపార్టీ నేతలే లక్ష్యంగా ఐటీ దాడులు కొనసాగటం నేడు హాట్‌ టాపిక్‌గా మారింది.రాజకీయవర్గాల్లో ఐటీ తనిఖీలపై విస్త్రుృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం చంద్రబాబునాయుడు అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.టీడీపి నేతలపై ఐటీ దాడులను కేంద్రమే చేయిస్తోందని,నేతలంతా ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. టీడీపిలోనే కాకుండా ఏపి రాజకీయ వర్గాల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుసగా టీడీపి నేతలనే టార్గెట్‌గా ఐటీ సోదాలు జరుపుతుండటం పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని సీఎం అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.

నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే ,టీడీపి నేత బీద మస్తాన్‌రావు వ్యాపార సంస్థపై ఐటీ దాడులు జరిగాయి. గురువారం మొదలైన ఈ తనిఖీలు శుక్రవారం కూడా కొనసాగాయి. కందుకూరు మాజీ టీడీపీ ఎమ్మెల్యే పోతుల రామారావు,ఆయన కుటుంబ సభ్యులు కంపెనీల్లో సోదాలు జరిగినట్లు కూడా చంద్రబాబుకు సమాచారం అందింది. టంగుటూరు మండలం చెరువుకొమ్ముపాలెంలోని సదరన్‌ గ్రానైట్స్‌ కంపెనీలో ఐటీ సోదాలు నిర్వహించింది. అలాగే జరుగుమిల్లి మండలం కె.బిట్రగుంటలో సదరన్‌ ట్రోపికల్‌ ఫుడ్స్‌ఆపీస్‌లో ఐటీ తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది.

నారాయణ విద్యాసంస్థల్లో తనిఖీలు చేయడానికి ప్రయత్నించటం ఇది కేవలం టీడీపి నేతలపై కక్ష సాధింపులా కనిపిస్తోందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడుతున్నారు. బీజేపి కుట్రలను తిప్పికోట్టాలని ఆయన సూచిస్తున్నారు. దీనిపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కూడా చెబుతున్నారు.శుక్రవారం గుంటూరు,విజయవాడలోని పలు కన్‌స్ట్రక్షన్‌ ఆఫీసుల్లో సోదాలు కొనసాగాయి. సదరన్‌ ,వీఎన్‌ లాజిస్టిక్స్‌ కంపెనీల్లో ,విజయవాడలోని సదరన్‌ కంపెనీ ప్రతినిధుల ఇళ్లలో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది.

గుంటూరులోని విఎస్‌ లాజిస్టిక్‌ కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలిసింది.రైల్వేకోచ్‌ల మరమ్మతులు,నిర్మాణాల్లో ఉన్న విఎస్‌ లాజిస్టిక్స్‌,జగ్గయ్యపేట సమీపంలో సిమెంట్‌ బ్రిక్స్‌ తయారీ కంపెనీల్లో ఐటీ దాడులు కలకలం రేపాయి.రాజధాని ప్రాంతంలో ఉన్నట్టుండి ఐటీ దాడులు జరగటంతో ఈ వ్యవహరం చర్చనీయాంశంగా మారింది.తాజా సమాచారం ప్రకారం ఐటీ అధికారులు నెల్లూరులోని మంత్రి నారాయణ ఇంటి వద్దకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో మంత్రి నారాయణ ఇంట్లోనే ఉన్నట్లు చెబుతున్నారు. అక్కడకు ఎవరు రాలేదని, తమ సంస్థల్లో ఎలాంటి ఐటీ సోదాలు జరగలేదని మంత్రి చెబుతున్నారు.