హైదరాబాద్ లో ఐటీ శాఖ సోదాలు

కోహినూర్ గ్రూప్ సహా రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో తనిఖీలు

income tax department
income tax department

హైదరాబాద్‌ః హైదరాబాద్ లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఇన్ కం టాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. నగరంలోని సుమారు 20 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. కోహినూర్ గ్రూప్ తో పాటు మరో రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందిన ఆఫీసులు, డైరెక్టర్ల ఇళ్లల్లో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. మాదన్నపేట్, కొండాపూర్, మెహదీపట్నం, శాస్త్రిపురంతో పాటు పలుచోట్లకు ఉదయం 6 గంటలకే అధికారులు చేరుకున్నారు.

మాదన్నపేట రామచంద్ర నగర్ లోని కోహినూర్ డెవలపర్స్ కంపెనీ డైరెక్టర్ ఇంట్లో వివిధ డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. సంస్థ ఆదాయానికి సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. కోహినూర్ డెవలపర్స్ సంస్థ సిటీతో పాటు శివార్లలోనూ పలు ప్రాజెక్టులు చేపట్టింది. ప్రభుత్వ భూములలోనూ ఈ గ్రూపు వెంచర్లు వేసింది. అయితే, ఈ సంస్థ వెనక ఓ రాజకీయ నాయకుడి హస్తం ఉందని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ రాజకీయ నాయకుడు ఎవరనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.