అవినీతి అంతం అందరి బాధ్యత

Corruption
Corruption

అవినీతిని నిర్వచించడం చాలా సులభం. దాని అర్థాన్ని లేదా ఫలితాన్ని అర్థం చేసుకోవడం కూడా సులభం. కానీ మూసివేసిన తలుపుల వెనుక జరిగే విధానం వివరించడం లేదా అర్థం చేసుకోవడం కష్టం. అవినీతి అంటే స్వలాభం కోసం పదవి దుర్వినియోగం చేయడం దారుణ అంశం. ఇటీవల కాలంలో తెలంగాణాలో అవినీతి కేసులు పెరగడం బాధాకరం. 2018తో పోలిస్తే రాష్ట్రంలో అవినీతి కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగింది. 2019లో తెలంగాణాలో 173 ఎసిబి కేసులు నమోదు అయినట్టు అధికారులు వెల్లడించారు. 2018లో రాష్ట్రవ్యాప్తంగా 139 అవినీతి కేసులను ఎసిబి నమోదు చేయగా 2019లో ఈ సంఖ్య 173కు చేరింది. అత్యధికంగా రెవెన్యూశాఖలో 54 కేసులు నమోదు చేశారు. ఈ లెక్కని పరిశీలిస్తే అవినీతి దేశంలో రోజురోజుకి ఏవిధంగా పెరు గుతుందో స్పష్టంగా చెప్పవచ్చు.

హోంశాఖలో 18, మున్సిపల్‌ శాఖలో 25, పంచాయతీరాజ్‌ శాఖలో 10, విద్యుత్‌ శాఖకు చెందిన 12 మంది ఉద్యోగులపై కేసులు నమోదు అయ్యాయి. హెల్త్‌ అండ్‌ మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌లో 13, న్యాయశాఖలో 5, ఇరిగేషన్‌ శాఖలో 3, విద్యాశాఖలో 4, రోడ్డు రవాణాశాఖలో 3 కేసులను ఎసిబి నమోదు చేసింది. 2019లో నమోదైన ఎసిబి కేసుల సంఖ్యను పరిశీలిస్తే రెవెన్యూశాఖలో అత్యధికంగా 54 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది రెవెన్యూశాఖలో 37 అవి నీతి కేసులు నమోదైతే 2019లో అత్యధికంగా 54 కేసులు నమోదయ్యాయి.

అవినీతి కేసుల్లో రెవెన్యూశాఖ మొదటిస్థానంలో ఉండగా 25 కేసులతో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ రెండోస్థానంలో నిలిచింది. అవినీతి అనకొండలు లంచావతారాలు రెచ్చిపోతున్నారు. పైసలు లేనిదే ఫైల్‌ కదలట్లేదు. అక్రమార్జనే డ్యూటీగా పెట్టుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే 2019లో మరింత అవినీతికి పాల్పడినట్లు ఎసిబి లెక్కలు చూస్తే అర్థం అవ్ఞతుంది. సర్కారు అధికారుల అవినీతి టాప్‌లో రెవెన్యూ, రెండోస్థానంలో మున్సిపల్‌శాఖ, మూడులో నాలుగో సింహం అవినీతిలో పోటీపడుతున్నాయి. మేమంటే మేమని అందినకాడికి దోచుకుంటున్నాయి. అందిన కాడికి దోచుకుంటున్న అవినీతి అనకొండల భరతం పట్టాల్సిందే. లంచాలకు రుచి మరిగిన ప్రభుత్వ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు.

ఏటా వందల మంది ఎసిబికి చిక్కినా అవినీతి అధికారుల్లో మార్పురావడం లేదు. డిపార్ట్‌మెంట్‌ ఏదైనా సరే సామాన్యున్ని వదలకుండా అక్రమ వసూళ్లకు పాల్పడు తున్నారు. అవినీతి రహిత పాలన అందిస్తున్నామని ఓ వైపు ప్రభుత్వం చెబుతుంటే మరోవైపు అవినీతి అధికారులు అందినంతా దండుకుంటున్నారు. వేలల్లో జీతాలు ఉన్నా బల్ల కింద బ్యాలెన్స్‌ లేనిదే పెన్ను కదపడం లేదు. ప్రతి ఏటా ఎంత మంది అధికారులు ఎసిబికి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కినా శాఖల్లో పేరుకుపోయిన అవినీతి మాత్రం వీడడం లేదు. ఎసిబికి బెదరకుండా అందినంత అవినీతి సొమ్ము సంపాదిస్తున్నారు. డిపార్ట్‌మెంట్ల వారిగా ఎవరికి అందినకాడికి వారు దోచు కుంటున్నారు. ఈ పరిస్థితి నేపథ్యంలో దేశంలో రోజురోజుకు అవినీతి పెరిగిపోతున్న విషయం తెలిసిందే.

నేటి సమాజంలో ఏ రంగమైనా అవినీతిమయం అయిపోయింది. కానీ దేశం మొత్తం లో అవినీతి మరకలు లేనివారు ఎవరైనా ఉంటే అది కేవలం రైతన్నలు మాత్రమే. ఆరుగాలం పొలంలో కష్టపడి భూ తల్లికి సేవ చేసి దాని ద్వారా వచ్చిన ధాన్యాన్ని పది మందికి పంచిపెట్టి కడుపు నింపడమే రైతన్నలకు తెలుసు. అయితే ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఏర్పడింది. రైతులకు కోట్ల రూపాయలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతున్న వారికి రాజకీయ నాయకులు ప్రభుత్వాలు మద్దతు పలుకుతున్నాయి. కానీ ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు మాత్రం మద్దతు ధరలు ప్రకటించాలని కోరితే మాత్రం లాఠీచార్జీలు జరుగుతున్నాయి. ఇదే పరిస్థితి ఉత్పన్నం అయితే దేశం దేహాన్ని చంపుకోవాల్సిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగిపోతోంది.

ఆఫీసర్లు లంచాలు తీసుకుంటూ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెడుతూ ఎసిబికి చిక్కుతున్నారు. వీరిలో అసిస్టెంట్‌ స్థాయి నుంచి హైలెవల్‌ ఆఫీసర్‌వరకు ఉన్నారు. పోయినేడుతో పోలిస్తే ఎసిబి కేసుల సంఖ్య34 పెరిగింది. ఈ ఏడాది నమోదైన కేసుల వివరాలను ఎసిబి కార్యాలయం ఇటీవల వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం ఈసారి మొత్తం 173 కేసులు నమోదు కాగా 179 మందిని రిమాండ్‌కుతరలించారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో అత్యధికంగా 54 మంది, మున్సిపల్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌లో 25 మంది, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో 18మంది ఎసిబికి దొరికారు. ఎప్పటిలాగే ఈ మూడు డిపార్ట్‌మెంట్‌లు ఈసారి కూడా టాప్‌ మూడులో నిలిచాయి. పంచాయతీరాజ్‌, ఆర్డీఓ, సబ్‌రిజిస్ట్రార్‌, ఎలక్ట్రిసిటీ, ఫిషరీస్‌, హెల్త్‌, ఫారెస్ట్‌, ల్యాండ్‌సర్వే డిపార్ట్‌మెంట్‌లలో కొంత మంది అధికారులు ఎసిబికి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు.

బాధితులకు న్యాయం జరిగేలా కోర్టులో వాదించాల్సిన ఇద్దరు అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు కూడా ఈసారి ఎసిబికి దొరికిన వారిలో ఉండటం గమనార్హం. ఎసిబి ఈ ఏడాది 133 ట్రాప్‌కేసుల్లో 145 మంది ఆఫీసర్లను అరెస్టు చేసింది. 9 మందిని ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో అదుపులోకి తీసుకుంది. ఈ ఏడాది నమోదైన కేసుల్లో ఈఎస్‌ఐ స్కామ్‌ అతిపెద్దది. రూ.200 కోట్ల విలువైన ఈ కుంభకోణంలో ఐఎంఎస్‌ మాజీ డైరెక్టర్‌ దేవికారాణి సహా 22 మందిని ఎసిబి అరెస్టు చేసింది. లంచాలు అడగడంలోనూ, అధిక మొత్తంలో తీసుకోవడంలోనూ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ టాప్‌లో ఉంది.

సిద్దిపేట జిల్లా అక్కన్న పేట్‌ తహసీల్దార్‌ లంచం తీసుకుంటూ ఎసిబికి దొరికింది. 2019లో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. ఎసిబి అవినీతి అధికారులను అరెస్టు చేసింది, చేస్తుంది. కానీ చర్యలు మాత్రం పెద్దగా ఏమీ లేదని కేసు విచారణలను గమనిస్తే ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. అందుచేత కేసు విచారణ హేతుబద్ధగా జరిపి దేశ ప్రజానీకానికి ప్రజాస్వా మ్య వ్యవస్థపై నమ్మకం కలిగేలా చూడాల్సిన అవసరం ఉంది.

మన్నారం నాగరాజు
(రచయిత: తెలంగాణ లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు)

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/