కలసి జీవించడమే ఉత్తమం!

Sad Lady
Sad Lady

నా భర్త నన్ను ప్రేమించి పెళ్లాడారు. మరొక యువతితో ప్రేమకలాపాలు సాగిస్తున్నాడు. నాతో పిల్లలు వద్దంటూ తప్పించుకుంటున్నారు. ఆమెకు రెండుసార్లు అబార్షన్‌ చేయించారు. ఏదో విధంగా నన్ను ఒదిలించుకుని ఆమెను పెళ్లాడాలని ప్రయత్నించారు. ఇప్పుడు ఆమె మరొకరిని పెళ్లాడటానికి నిర్ణయించుకోవడంతో తట్టుకోలేక ఆత్మహత్యాప్రయత్నం చేశారు. అతనిని ప్రేమో, వ్యామోహమో, మానసికరోగమో అర్ధంకావడం లేదు. ఇలాంటి వాడితో కలసి కాపురం చేయాలా లేక విడిపోయా కొత్త జీవితం ప్రారంభించాలా అన్న సందిగ్ధంలో ఉన్నాను. మీ సలహాను బట్టి నిర్ణయం తీసుకుంటాను. నా వయసు 25 సంవత్సరాలు. బిటెక్‌ పాసయ్యాను.

నా భర్తకు 28యేళ్లు. ఆయన బిటెక్‌ పాసై బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నారు. నేను బిటెక్‌ ఆఖరి సంవత్సరం చదివే రోజుల్లో ఆయనతో పరిచయం అయ్యింది. అది కాస్త ప్రేమగా మారింది. విషయం ఇంటిలో తెలియడంతో మందలించారు. నేను అతన్నే పెళ్లాడతానని మొండిపట్టు పట్టడంతో కొట్టి, నిర్బంధించే ప్రయత్నం చేశారు. దీంతో అమ్మ, నాన్న కళ్లుగప్పి ఇంటి నుంచి పారిపోయి అతన్ని గుడిలో పెళ్లి చేసుకున్నాను. కొన్నాళ్లు ఇద్దరం బెంగుళూరులోనే కాపురం పెట్టాము. తరువాత కుటుంబం నడపడం కష్టకావడం వల్ల నేను, అమ్మ, నాన్నల వద్దకు వచ్చాను. వారు కూడ మమ్మల్ని క్షమించి ఆదరించారు. తాను స్థిరపడేవరకు నన్ను పుట్టింట్లోనే ఉండమన్నారు. నేను సరేనన్నాను. అమ్మ, నాన్న సమ్మతించారు.

ఆయన వారం, వారం మా ఇంటికి వచ్చి వెళ్లడం జరుగుతున్నది. పెళ్లయి అయిదేళ్లయినా పిల్లలు కనడానికి అతను ఇష్టపడడం లేదు. పిల్లలు పుడితే కెరీర్‌ కష్టమవ్ఞతుందని మరింత స్థిరపడిన తరువాత పిల్లల కోసం ప్రయత్నిద్దామని నన్ను మభ్యపెడుతూ వస్తున్నారు. అయితే అతను నాకు తెలియకుండా మరొక యువతిని ప్రేమిస్తున్నారు.

నిజానికి నా కంటే ముందే ఆమెతో అతనికి పరిచయం ఉంది. అయితే అది దాచిపెట్టి నన్ను, ప్రేమించి పెళ్లాడారు. ఆమె కూడ బెంగుళూరులోనే ఉద్యోగం చేస్తున్నది. వరిద్దరి మధ్య గాఢమైన ప్రేమబంధం కొనసాగుతున్నది. దీనివల్ల ఆమెకు రెండుసార్లు గర్భస్రావం చేయించాల్సి వచ్చింది? పెళ్లి కాక ముందే తల్లి కావడానికి భయపడి అబార్షన్లు చేయించుకోవడానికి ఆమె సమ్మతించింది. ఇదిలా ఉండగా ఏదో విధంగా నన్ను వదిలించుకోవడానికి ప్రయత్నితిస్తూ వచ్చారు.

నన్ను సూటిపోటి మాటలు అనడం, అనుమానించడం చేసేవారు. మా మిత్రుల వద్ద నేనంటే తనకు ఇష్టం లేదని నన్ను విడాకులకు ఒప్పించమని ప్రాధేయపడే వారు. అయితే అందరు అతన్ని మందలించడంతో ఏమీ చేయాలో తోచక ఉన్నారు. నన్ను వదిలించుకుంటే తాను పెళ్లిచేసుకుంటానని, లేదంటే వీలు కాదని ప్రియురాలు తేల్చి చెప్పింది. ఎంత రపయత్నించినా వీలు కాకపోవడంతో ఆమె మరొకరిని పెళ్లాడటానికి నిర్ణయించుకున్నది.దాంతో తట్టుకోలేక మా వారు నిద్రమ్రాతలు మింగి మోటార్‌ సైకిపై వేగంగా వెళ్లి చెట్టుకు గుద్ది చనిపోయే ప్రయత్నం చేశారు. అయితే అదృష్టవశాత్తు చిన్న చిన్న గాయాలతో బతికి బయటపడ్డారు. వారం రోజులు ఆసుపత్రిలో చికిత్స చేయించిన తరువాత ఇంటికి తీసుకొచ్చాం. అయినా ఆమెను మరచిపోలేకపోతున్నానంటూ ఏడుస్తున్నారు. తన జీవితం ఇలా కావడానికి నేనే కారణమంటూ నిందిస్తున్నారు. ఇలాంటి వాడితొ కలసి ఉండటం కంటే విడిపోయి కొత్త జీవితం ప్రారంభించడం మేలని మా అమ్మ అంటున్నది. అయితే ప్రేమించి పెళ్లాడిన వ్యక్తిని విడిచిపెట్టడానికి నా మనసు అంగీకరించడం లేదు. స్నేహితులు కూడా ఒక్కొక్కరు ఒక విధంగా చెపుతున్నారు. ఏది మంచో, ఏది చెడో తేల్చుకోలేకపోతున్నాను. మీ సలహా ప్రకారం నడుచుకుందామని భావిస్తున్నాను. – షర్మిల

అమ్మా! మీ వారిది ప్రేమ అనడం కంటే వ్యామోహపూరిత వ్యక్తిత్వ లోపం అంటే సరిపోతుంది. ఇప్పటి యువతలో చాల మంది ఉద్వేగలు, కోరికలు, వ్యామోహం తీర్చుకోవడానికి ప్రేమ ముసుగులు వేసుకుంటున్నారు. ఇలాంటి వారిలో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ శాతం కనిపిస్తున్నారు. ఒకేసారి ఇద్దరు, ముగ్గురితో సమాంతర ప్రేమ వ్యవహారాలు నిర్వహించేవారు ఉన్నారు. పెళ్లికి ముందే గర్భస్రావాలు చేసుకునే అమ్మాయిల సంఖ్య పెరుగుతున్నది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. యువతలో విలువలు క్షీణించడం, ఉద్వేగ నియంత్రణ కోల్పోవడం, స్నేహాలు, పరిసరాల ప్రభావంలాంటివి చెప్పుకోవచ్చు.

మీ భర్త కూడా ఈ కోవలోని వాడే అంటే తప్పుకాదు. అయితే అతను బాగుపడని వ్యక్తిగా చూడవలసిన పనిలేదు. సరైన కౌన్సిలింగ్‌ ద్వారా అతని ప్రవర్తనలో మార్పు తీసుకురావచ్చు కాబట్టి ముందు అతన్ని ఒక సైకాలజిస్టు వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్‌ చేయించండి. ఆత్మహత్యా ప్రయత్నం చేశారు కాబట్టి డిప్రెషన్‌ ఉండవచ్చు. అలాగే చెట్టుకు గుద్దుకుని ఘోరమైన మరణం పొందాలనుకున్నాడంటే సైకోసిస్‌ లక్షణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి.

సహజంగా మితిమీరిన వ్యామోహం ఉన్నవారు తమకు అవరోధాలు ఎదురైనపుడు డిప్రెషన్‌, సైకోసిస్‌, ఉన్మాదం లాంటి రుగ్మతలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక క్లినికల్‌ సైకాలజిస్టు ద్వారా పరీక్షలు చేసి అవసరమైతే సైకియాట్రిస్టు ద్వారా చికిత్సలు చేయించండి. తప్పకుండా అతనిలో ూర్పు వస్తుంది. అంతే తప్ప మీరు తొందరపడి విడాకులు తీసుకుంటే సమస్య పరిష్కారం కాదు. అతను మరింత డిప్రెషన్‌కు గురై ఆత్మహత్యకు పాల్పడవచ్చు.

మీరు కూడ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. విడాకులు ఇచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అధిక శాతం మంది ఇష్టపడరు. ఒకవేళ ఎవరైనా పెళ్లాడినా గతం ప్రస్తావించి వేధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అతనిన మార్చుకుని కలసి జీవించడమే ఉత్తమం. అయితే అతను, అతని తల్లిదండ్రులు కౌన్సిలింగ్‌, చికిత్సలకు సహకరించకపోయి, అతని ప్రవర్తనలో మార్పు రానపుపడు మాత్రం విడాకులు తీసుకొనడంలో తప్పులేదు. రెండు నష్టాలలో చిన్న నష్టం పొందడమే మేలన్న సూత్రం ఇక్కడ వర్తిస్తుంది. కాబట్టి స్వీయ విశ్లేషణ చేసుకుని నిర్ణయం తీసుకోండి.

  • డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/