బాసర ట్రిపుల్ ఐటీ లోని సమస్యలు కాస్త సమయం పడుతుంది – కేటీఆర్

బాసర ట్రిపుల్ ఐటీ లోని కొన్ని సమస్యలు సద్దుమణిగాయని , మరికొన్ని సమస్యలు సద్దుమణగడానికి కాస్త సమయం పడుతుందన్నారు మంత్రి కేటీఆర్. సోమవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ..విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతోపాటు కలిసి భోజనం చేశారు.

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. నవంబర్లో మళ్లీ కాలేజీని సందర్శిస్తానని.. అప్పుడు విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేస్తామన్నారు. 3 కోట్లతో మినీ స్టేడియం, వెయ్యి కంప్యూటర్లతో డిజిటల్ ల్యాబ్, 50 అదనపు మోడర్న్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా మినీ టీహబ్, ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఆడిటోరియంలో విద్యార్థులు కింద కూర్చోవడంపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. మళ్లీ వచ్చేనాటికి విద్యార్థులు పైనా కూర్చోనేలా ఏర్పాట్లు చేయాలని వీసీకి సూచించారు. అదేవిధంగా విద్యార్థులతో కలిసి కేటీఆర్ కొద్దిసేపు కింద కూర్చున్నారు. అన్నీ ఇస్తాం కానీ మెయింటెనెన్స్ బాధ్యత మాత్రం విద్యార్థులదేనని చెప్పారు. ట్రిపుల్ ఐటీలో కొన్ని సమస్యలను పరిష్కరించామని.. మరికొన్ని పరిష్కరించాల్సివుందని తెలిపారు. మెస్లో బాత్రూం సహా ట్యాప్ సరిగ్గా లేదన్నారు. కొత్త మెస్సే ఇలా ఉంటే.. పాత మెస్ ఎలా ఉంటుందోనని వ్యాఖ్యానించారు.

సమ్మె సందర్భంలో బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులు అనుసరించిన విధానం తనను ఆకట్టుకుందని తెలిపారు. రాజకీయాలకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా తమ సమస్యలపై తామే పోరాడిన విద్యార్థులను అభినందించారు. మహాత్మా గాంధీ తరహాలో శాంతియుతంగా, వర్షం పడుతుందా లెక్క చేయకుండా బయట కూర్చుని నిరసన తెలియజేయడం చాలా మందికి నచ్చిందని, అందులో తాను ఒకడినని తెలిపారు. మనది ప్రజాస్వామిక దేశం అని, ఏదైనా సమస్య పరిష్కారం కానప్పుడు నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని పేర్కొన్నారు.