మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..నింగిలోకి పీఎస్‌ఎల్వీ -సీ55

424కి చేరుకోనున్న ఇస్రో పంపిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య

ISRO To Launch Singaporean Earth Observation Satellite TeLEOS-02 On Saturday

తిరుపతిః భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో వాణిజ్య ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న షార్‌ మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం మధ్యాహ్నం 2.19 గంటలకు పీఎస్‌ఎల్వీ-సీ 55 రాకెట్‌ను ప్రయోగించనుంది. దీనిద్వారా సింగపూర్‌కు చెందిన 741 కిలోల టెల్‌ ఈవోఎస్‌-2 ఉపగ్రహంతోపాటు 16 కిలోల బరువున్న లుమొలైట్‌ అనే చిన్న ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది.

దీనికి సంబంధించి శుక్రవారం ఉదయం 11.49 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది. మొత్తం 25.30 గంటలపాటు కౌంట్‌డౌన్‌ కొనసాగనుంది. దీని రిహార్సల్‌ను శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. రిహార్సల్‌లో భాగంగా రాకెట్‌ను మొబైల్‌ సర్వీసు టవర్‌ నుంచి వెనక్కి తీసుకెళ్లారు. కాగా, ఒక రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసి నెల రోజులు పూర్తికాకముందే మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధం చేయడంతో రికార్డు నెలకొల్పనుంది.