మార్చిలో జీఎస్ఎల్‌వీ మార్క్ త్రీ రాకెట్ ప్రయోగం: ఇస్రో చీఫ్ సోమనాథ్

శ్రీహరికోట: ఏపిలోని శ్రీహరికోట నుంచి ఈరోజు ఇస్రో మూడు శాటిలైట్లను నింగిలోకి పంపిన విషయం తెలిసిందే. ఎస్ఎస్ఎల్‌వీ-డీ2 రాకెట్ ఆ ఉపగ్రహాలను విజయవంతంగా మోసుకెళ్లింది. ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ మీడియాతో మాట్లాడారు. సరైన కక్ష్యలో శాటిలైట్లను పంపాలని, ఈ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఆయన మూడు శాటిలైట్ టీమ్‌లకు కంగ్రాట్స్ తెలిపారు. ఎస్ఎస్ఎల్వీ-డీ1లో ఎదురైన సమస్యలను పరిష్కరించి, డీ2 ప్రయోగం సక్సెస్ అయ్యేలా చూశామన్నారు.
జీఎస్ఎల్‌వీ మార్క్ త్రీ రాకెట్ ప్రయోగం కోసం ఇక ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. ఆ రాకెట్ ద్వారా వన్‌వెబ్ ఇండియాకు చెందిన 236 శాటిలైట్లను ప్రయోగించనున్నారు. ఆ లాంచ్ కోసం ప్రిపేరవుతున్నట్లు ఆయన వెల్లడించారు. మార్చిలో ఆ ప్రయోగం జరగనున్నట్లు ఆయన తెలిపారు. రీయూజబుల్ లాంచ్ వెహికిల్‌కు చెందిన పరీక్ష కూడా చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ల్యాండింగ్ సైట్ చిత్రదుర్గ వద్ద పనులు జరుగుతున్నట్లు తెలిపారు. గగన్‌యాన్ ప్రోగ్రామ్‌కు చెందిన అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఈ ఏడాది నిర్వహించనున్నట్లు ఇస్రో చీఫ్ తెలిపారు.