ఇజ్రాయెల్‌లో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదు

జెరూసలేం: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి కొనసాగుతుంది. ఇప్పటికే బ్రిటన్‌, అమెరికాలో మరణాలు నమోదవగా.. తాజాగా ఇజ్రాయెల్‌లో ఒమిక్రాన్‌ కారణంగా ఓ వ్యక్తి మరణించాడు. ఈ విషయాన్ని దేశ అధికారులు ధ్రువీకరించారు. దక్షిణ నగరమైన బీర్షెబాలోని సోరోకా హాస్పిటల్‌లో 60 సంవత్సరాల వ్యక్తి ఆసుపత్రిలో చేరిన రెండు వారాల తర్వాత సోమవారం మరణించాడని పేర్కొన్నారు. సదరు వ్యక్తి ఇంతకు ముందు పలు ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడ్డాడని తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఒమిక్రాన్‌ నేపథ్యంలో ఇప్పటికే ఇజ్రాయెల్‌ అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. అలాగే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంక్షలు విధించేందుకు కసరత్తులు చేస్తున్నది. వృద్ధులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు నాల్గో డోస్‌ ఇచ్చేందుకు ఆరోగ్యశాఖ అధికారుల ఆమోదం కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌ మంగళవారం పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రజలకు విస్తృతంగా టీకాలు వేసింది. ఆ తర్వాత బూస్టర్‌ డోస్‌ సైతం అందించిన దేశంగా నిలిచింది. 9.3 మిలియన్ల జనాభా ఉన్న దేశంలో కొవిడ్‌ కారణంగా 8,200 మంది మరణించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/