ఉప్పల్ మ్యాచ్ కు వెళ్తున్నారా..? అయితే రెండు బకెట్ల నీళ్లు, ఇంత సర్ఫ్ తీసుకెళ్లండి..

ఇప్పుడు ఇదే సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దాదాపు మూడేళ్ల తర్వాత హైదరాబాద్ లో ఇండియా మ్యాచ్ జరగబోతుంది. దీంతో క్రికెట్ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఎప్పుడెప్పుడు మ్యాచ్ చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. అయితే మ్యాచ్ చూసేందుకు వెళ్లే వారు ‘టికెట్ తో పాటు రెండు బకెట్ల నీళ్లు, ఇంత సర్ఫ్ తీసుకెళ్లండి.. మీరే కడుక్కుని మీ సీట్లలో కూర్చోవాలి’ అని సోషల్ మీడియా లో కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఎందుకంటే ఉప్పల్ స్టేడియం లో కూర్చునే సీట్లు అంత దారుణంగా ఉన్నాయి. టికెట్ల విషయంలో కఠినంగా వ్యవహరించిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌.. స్టేడియం నిర్వహణను మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదని అక్కడ సీట్లే చెపుతున్నాయి. ప్రస్తుతం స్టేడియం లోని కుర్చీల తాలూకా ఫొటోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ కుర్చీలు చూసి మరీ ఇంత దారుణంగా ఉన్నాయా అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచే ప్రయత్నాలు చేస్తుంటే.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడేళ్ల గ్యాప్ తర్వాత కీలక మ్యాచ్ జరుగుతున్నా.. ఇంత నిర్లక్ష్యం ఏంటని క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితులు చూసి.. మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎవరైనా ఒప్పుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. మరికొన్ని గంటల్లో మ్యాచ్ మొదలుకాబోతుంది. కనీసం స్డేడియంను క్లీన్ చేయించే స్థితిలో.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే..ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ ఉత్కంఠగా మారింది. నాగ్‌పూర్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో.. ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రేపు ఆదివారం రాత్రి 7 గంటలకి జరగనుంది.