జిన్‌పింగ్‌తో ఈ విష‌యం మాట్లాడ‌టానికి మోడీ భ‌య‌ప‌డుతున్నారా..? : ఒవైసీ

asaduddin-owaisi

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీపై మ‌జ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. చైనాలోని జింజియాంగ్ ప్రాంతంలో మానవ హక్కుల పరిస్థితిపై చర్చ‌ను కోరుతూ ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానంపై.. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో ఓటింగ్‌కు భార‌త్ హాజ‌రుకాలేదు. దీనిపై ఒవైసీ ట్విట్ట‌ర్ ద్వారా నిప్పులు చెరిగారు. వీఘర్ ముస్లింల సమస్యపై ముఖ్యమైన ఓటు వేయకుండా చైనాకు సాయపడాలని భారత్ ఎందుకు నిర్ణయం తీసుకుందో ప్రధాని మోడీ వివరిస్తారా? అని ప్రశ్నించారు. మోడీ 18 సార్లు జీ జిన్‌పింగ్‌ను కలిశార‌ని, అయినా మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌పై ఆయ‌న ఎందుకు మాట్లాడ‌టం లేద‌ని నిల‌దీశారు. జిన్‌పింగ్‌తో ఈ విష‌యం మాట్లాడ‌టానికి మోడీ భ‌య‌ప‌డుతున్నారా..? అన్నారు.

చైనాలోని జింజియాంగ్‌లో వీఘర్ ముస్లింలపై మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, వీటిపై చర్చించాలని ప్రతిపాదించిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలి తిరస్కరించింది. భారత్, మలేసియా, ఉక్రెయిన్ సహా 11 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరుకాగా, 19 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఈ తీర్మానాన్ని కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్, బ్రిటన్, అమెరికా ప్రతిపాదించాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/