తెనాలి లో ఐరన్ స్క్రాప్‌తో ప్రధాని మోదీ విగ్రహం

తెనాలి లో ఐరన్ స్క్రాప్‌తో ప్రధాని మోదీ విగ్రహం

మన దేశంలో ఎవరూ కూడా ఇంతవరకు చేయని పనిని తెనాలి వాసులు చేసారు. ఆటోమొబైల్ ఐరన్ స్క్రాప్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహాన్ని తీర్చిదిద్ది వార్తల్లో నిలిచారు. తెనాలికి చెందిన సూర్య శిల్ప శాల నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరావు, ఆయన కుమారుడు రవిచంద్ర 14 అడుగుల ఎత్తు గల మోడీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. దాదాపు రెండు టన్నుల బరువు తో ఈ విగ్రహం రూపొందించారు. బెంగళూరుకు చెందిన ఒక సంస్థ ఈ విగ్రహాన్ని తయారు చేయించినట్లు వారు చెప్పుకొచ్చారు.

ఐరన్ స్క్రాప్‌తో ప్రధాని మోదీ పోలికలతో విగ్రహాన్ని తయారు చేయడం చాలా కష్టంతోనూ, సాహసంతో కూడిన పని. అలాంటి పనిని వీరు చేసి చూపించారు. ఈ విగ్రహాన్ని రూపొందించడానికి మూడు నెలలు పట్టినట్లు చెపుతున్నారు. పదిమంది పని వాళ్లతో కష్టపడి చేశామన్నారు. ఈనెల 16న ఈ విగ్రహాన్ని బెంగళూరు తరలిస్తున్నారు. ఈ విగ్రహాన్ని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పరిశీలించారు. తెనాలికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు ,రవిచంద్రలను ప్రత్యేకంగా అభినందించారు.