ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్హా నియామకం

ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా మహేష్‌చంద్ర లడ్హాను ప్రభుత్వం నియమించింది. ఏపీ క్యాడర్ 1998 బ్యాచ్‌కి చెందిన ఆయన ప్రస్తుతం సీఆర్పీఎఫ్ సదరన్ సెక్టర్ ఐజీగా పని చేస్తున్నారు. తాజాగా ఆయణ్ని తిరిగి ఆంధ్రప్రదేశ్​కు రిలీవ్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లడ్హా గతంలో పని చేసిన జిల్లాల్లో నక్సలిజం, ఫ్యాక్షనిజం, వ్యవస్తీకృత నేరాలు, కీలక ముఠాలు, రౌడీయిజంపై ఉక్కుపాదం మోపారు.

విజయవాడ నగర జాయింట్ పోలీస్ కమిషనర్‌గా, విశాఖ నగర పోలీస్ కమిషనర్‌గా, నిఘా విభాగంలో ఐజీగానూ చేశారు. 2019-20 మధ్య ఏపీ పోలీస్ పర్సనల్ విభాగం ఐజీగా పని చేసి కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లారు. అక్కడ సీఆర్పీఎఫ్‌లో ఐజీగా నాలుగేళ్ల పాటు పని చేసి తాజాగా ఏపీకి తిరిగొచ్చారు.

ప్రకాశం జిల్లా ఎస్పీగా లడ్హా సేవలందిస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు క్లెమోర్‌మైన్స్‌తో పేల్చేశారు. అది బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడంతో లడ్హాతో పాటు ఆయన ఇద్దరు గన్‌మెన్లు, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు పౌరులు మృతి చెందారు. అప్పట్లో ఈ ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.