ఢిల్లీ క్యాపిటల్స్‌కు దూరమవుతున్న స్టార్‌ ఆల్‌రౌండర్‌

Chris Woakes
Chris Woakes

న్యూఢిల్లీ: ఈనెల 29న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్‌) 13వ సీజన్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌కు మరో 20 రోజులు ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు మరో​ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లండ్‌ స్టార్ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ ఐపిఎల్‌ కు దూరమయ్యే యోచనలో ఉన్నాడని సమాచారం తెలుస్తోంది. సమ్మర్‌లో తన అంతర్జాతీయ కెరీర్‌ను ఫ్రెష్‌గా ఆరంభించాలనుకుంటున్న వోక్స్‌.. ఐపిఎల్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. జూన్‌ 4 నుంచి సొంతగడ్డపై ఇంగ్లండ్‌ రెండు టెస్టు సిరీస్‌లు ఆడాల్సి ఉంది. తొలుత శ్రీలంకతో, ఆ తర్వాత వెస్టిండీస్‌తో మూడేసి మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలోనే ఆ టెస్టు సిరీసుల్లో రాణించేందుకు వోక్స్‌ ఐపిఎల్‌ నుంచి తప్పుకొన్నట్లు సమాచారం. వోక్స్‌ ఢిల్లీ ఫ్రాంచైజీకి తాను తప్పుకుంటున్నట్లు ఇప్పటికే తెలియజేసినట్లు తెలుస్తోంది. వోక్స్‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా ఢిల్లీ పరిశీలిస్తుందట. గతేడాది డిసెంబర్‌ 19న కోల్‌కతాలో జరిగిన ఐపిఎల్‌ ఆటగాళ్ల వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ క్రిస్‌ వోక్స్‌ను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

తాజా ఇంగ్లీష్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/english-news/