ఇండియాలోనే ఆపిల్‌ ఫోన్ల తయారీ: రవిశంకర్‌

iphone
iphone

న్యూఢిల్లీ: ఆపిల్‌ ఫోన్ల అంటేనే ప్రపంచమంతా ఒకటే క్రేజ్‌. ఆ కంపెనీ నుంచి వచ్చే ప్రతి కొత్త మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన మొదటి రోజే కైవసం చేసుకోవాలని కలలు కంటారు. ముఖ్యంగా ఐఫోన్‌ సిరీస్‌ మొబైల్‌ ఫోన్లకు డిమాండ్‌ చాలా ఎక్కువ. అయితే, ఇప్పటివరకు ఆపిల్‌ సంస్థ తమ ఉత్పత్తులను అమెరికాలో డిజైన్‌ చేసి చైనాలో తయారుచేస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకొని భారత్‌ సహా ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తోంది. కానీ ఇకపై ఆపిల్‌ ఫోన్లు ఇండియాలోనే తయారు కాబోతున్నాయి. అతి త్వరలోనే ఆపిల్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు. దీంతో త్వరలోనే మనం మేడ్‌ ఇన్‌ ఇండియా ఆపిల్‌ ఐఫోన్‌ను వాడబోతున్నామన్నమాట. అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ చైనాతో వాణిజ్య యుద్ధం చేస్తున్నారు. చైనాలో వివిధ రంగాల్లో పనిచేస్తోన్న అమెరికా కంపెనీలను ఆ దేశం వీడాల్సిందిగా అల్టిమేటం జారీచేసారు. ఈ నేపథ్యంలో అమెరికా కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయ దేశాలపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా ప్రపంచంలోనే ఐదు అతిపెద్ద వినియోగ మార్కెట్లలో ఒకటైన భారత్‌ వాటికి ఆకర్షణీయంగా కనిపిస్తోంది. భారత్‌లో తయారీకి ఆపిల్‌ పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం తమిళనాడులోని శ్రీపెరంబుదూరు వేదిక అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

అయితే, ముంబైలో అతిపెద్ద ఆపిల్‌ స్టోర్‌ నెలకొల్సాలని కూడా కంపెనీ తలపోస్తున్నట్లు కేంద్ర మంత్రి హింట్‌ ఇచ్చారు. అదే సమయంలో ఇప్పటికే భారత్‌లో మొబైల్స్‌ తయారు చేస్తున్న ఫాక్స్‌కాన్‌ రెండో, మూడో తయారీ యూనిట్‌ కూడా నెలకొల్పే అవకాశం ఉంది. శ్యాంసంగ్‌ కూడా చైనా నుంచి తరలిరానుంది. కస్టమ్స్‌ సుంకం 5శాతం కూడా రద్దు చేయడంతో మరిన్ని కంపెనీలు ముందుకు వచ్చే అవకాశలున్నాయి. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఆపిల్‌ ఇప్పటికే పలు చర్యలు తీసుకోంది. ఇందులో భాగంగా అమెరికా వెలుపల అతిపెద్ద ఆఫీస్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పింది. హైదరాబాద్‌ కేంద్రంగా ఆపిల్‌ తన కార్యకలాపాలు కొనసాగించనుంది.

ఇందులో మ్యాప్‌ డెవలప్‌మెంట్‌ కార్యకలాపాలు కూడా ఉండనున్నాయి. అయితే తయారీకి మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీ గానీ, తమిళనాడులోని శ్రీపెరంబుదూరును ఎంచుకొనే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆపిల్‌ సిఇఒ టిమ్‌కుక్‌ కూడా హైదరాబాద్‌ ఆఫీస్‌ విస్తరణపై పాజిటివ్‌గా ఉన్నారు. ఆయన ప్రత్యక్షంగా హాజరై ఇక్కడ నిర్వహణ సులభంగా ఉందని, ఉద్యోగుల సంఖ్యను భారీగా పెంచుతామని హామిఇచ్చారు. ఆపిల్‌ ఫోన్లు భారత్‌లోనే తయారుచేస్తే, వాటి ధరలు కొంత మేరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై కస్టమ్స్‌ సుంకం విధిస్తారు. దీంతో ఆ మేరకు భారం వినియోగదారులపై పడుతుంది. కానీ భారత్‌లోనే తయారు చేస్తే మాత్రం కస్టమ్స్‌ సుంకం పన్నులు ఏమి ఉండవు. అందుకే, ధరలు కనీసం 5 శాతం నుంచి 10 శాతం వరకు తగ్గే సూచనలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/