రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ రీ ఓపెన్ కు కేసీఆర్ కు ఆహ్వానం

ఈ నెల 12 న ప్రధాని మోడీ తెలంగాణ లో పర్యటించబోతున్నారు. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)ను జాతికి అంకితం చేసేందుకు రామగుండానికి రానున్నారు. ఈ క్రమంలో బిజెపి ఆయా ఏర్పాట్లలో బిజీ గా ఉంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్రం ఆహ్వానం పంపింది. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహకరించాలని.. కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవియ కేసీఆర్‌కు లేఖ రాశారు.

కేంద్రమంత్రి రాసిన లేఖపై కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మోదీ తెలంగాణ టూర్‌పై ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. విభజన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తోంది. తెలంగాణ మేథావులు కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు. అటు ప్రధాని టూర్‌ను అడ్డుకుంటామని ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో.. కేంద్రమంత్రి లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 12న రామగుండం పట్టణానికి రానున్నారు. ఆ రోజున నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం ఎన్టీపీసీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. సత్తుపల్లి – కొత్తగూడెం రైల్వే లైనును అధికారికంగా ప్రారంభిస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి మంజూరైన 3 నేషనల్ హైవే ప్రాజెక్టులకు కూడా మోడీ రామగుండం వేదికగా శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.