ఆశలన్నీ సింధు, శ్రీకాంత్‌లపైనే!

నేటి నుంచి అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ సమాఖ్య ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌

PV Sindhu- Kidambi Srikanth
PV Sindhu- Kidambi Srikanth

Bangkok: అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ సమాఖ్య ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ బుధవారంనుంచి థాయిలాండ్‌లో ఆరంభం కానున్నాయి. ఈ టోర్నీలో పాల్గొంటున్న పివి సింధు, కిడాంబి శ్రీకాంత్‌పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. గత వారం ముగిసిన రెండు థాయిలాండ్‌ ఓపెన్‌ సూపర్‌-1000 టోర్నీలలో భారత షట్లర్లు నిరాశపరిచారు. ఈ టోర్నీలోనైనా టైటిల్‌ సాధించాలని సింధు, శ్రీకాంత్‌ ఉవ్విళ్లూరుతున్నారు.


సీజన్‌ ముగింపు నిర్వహిస్తున్న ఈ టోర్నీ థాయిలాండ్‌లో వరుసగా నిర్వహిస్తున్న మూడో టోర్నీ. గతవారం రెండు సూపర్‌-1000 టోర్నీలను నిర్వహించారు. ఇపుడు భారత అభిమానులందరి దృష్టి ప్రపంచ చాంపియన్‌ సింధుపైనే. ఆసియా లెగ్‌ టూర్‌లో నిర్వహించిన తొలి థాయిలాండ్‌ ఓపెన్‌లో సింధు తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. తరువాతి టోర్నీలో క్వార్టర్‌ఫైనల్‌వరకు వెళ్లగలిగింది. కొవిడ్‌ సంక్షోభం కారంణంగా దాదాపు ఏడాదిపాటు ఆటకు దూరంగా ఉండడం కారణంగా సింధు లండన్‌లో శ్‌ిక్షణ పొంది నేరుగా ఇక్కడకు వచ్చింది.

గతవారం టోర్నీలో ఏకపక్షంగా సాగిన క్వార్టర్‌ఫైనల్లో సింధు ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోవడం కలవరపరుస్తోంది. థాయిలాండ్‌కు చెందిన రచానక్‌ ఇంతనన్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి వరుస గేమ్‌లలో సింధును ఓడించింది. ఇపుడు సింధు ఆడనున్న పూల్‌లోనే రచానక్‌కూడా ఉండడంతో మరోసారి వీరిరువ్ఞరూ తలపడే అవకాశముంది. లండన్‌లో శిక్షణ పొందిన సింధు ఇపుడు తన విమర్శకులకు సమాధానం చెప్పే అవకాశం లభించింది.
పెద్ద టోర్నీలలో సింధు అనూహ్య విజయాలు సాధించడం మామూలే.

ఈ టోర్నీలోనూ సింధు అటువంటి ప్రదర్శనే చేయగలదని భావిస్తున్నారు. అయితే ఎనిమిదిమంది తలపడనున్న ఈ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీ డ్రా సింధుకు అంత అనుకూలంగా లేదు. మహిళల డ్రాలో సింధు గ్రూప్‌-బిలో తై జు యింగ్‌, రచానక్‌ ఇంతనన్‌, పొర్నపవీ చోచువాంగ్‌లతో తలపడాల్సి ఉంది. ముఖ్యంగా థాయిలాండ్‌ ఓపెన్‌ టోర్నీలు రెండింటిలో రన్నరప్‌గా నిలిచిన తై జుతో పోరు సింధుకు పెద్ద సవాలే. అంతేగాక గత టోర్నీలో ఇంతనన్‌ చేతిలోనే సింధు క్వార్టర్స్‌లో పరాజయం చవిచూసింది. రౌండ్‌రాబిన్‌ పద్ధతిలో జరిగే ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో సింధు కనీస రెండు మ్యాచ్‌లనైనా గెలిస్తేనే సెమీస్‌కు చేరుకోగలుతుంది. 2018లో చాంపియన్‌గా నిలిచిన సింధు గత ఏడాది నాకౌట్‌ స్థాయికి చేరుకోలేకపోయింది. ఇపుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నది.

శ్రీకాంత్‌ పుంజుకోగలడా!

పురుషుల సింగిల్స్‌లో భారత్‌ తరఫున కిడాంబి శ్రీకాంత్‌ థాయిలాండ్‌ ఓపెన్‌ టోర్నీలలో కోర్టులో చురుకైన కదలికలతో ఆశలు కల్పించినా తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. ప్రపంచ 14వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ థాయిలాండ్‌ ఓపెన్‌ తొలి టోర్నీలో తొలి మ్యాచ్‌లో స్వదేశానికే చెందిన సౌరభ్‌వర్మపై సునాయాసంగా గెలుపొందాడు. అయితే రెండో రౌండ్‌లో గాయంతో తప్పుకున్నాడు. రెండో టోర్నీ తొలి రౌండ్‌లో స్థానిక ఆటగాడు సిత్తికొమ్‌ థమసిన్‌పై సునాయాసంగా గెలుపొందాడు. అయితే తన రూమ్‌మేట్‌ సాయి ప్రణీత్‌కు కొవిడ్‌ సోకడంతో శ్రీకాంత్‌ రెండోరౌండ్‌నుంచి బలవంతంగా తప్పుకోవాల్సివచ్చింది. ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో పాల్గొనాల్సి ఉన్నందున థాయిలాండ్‌లోనే ఉండిపోవాల్సివచ్చింది. 14 రోజుల క్వారంటైన్‌ను ప్రభుత్వ అభ్యర్ధన మేరకు ఏడు రోజులకు తగ్గించడంతో శ్రీకాంత్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. ఇపుడు పూర్వపు ఫామ్‌ను శ్రీకాంత్‌ అందుకోగలడా అన్నది అతడే నిరూపించుకోవాల్సి ఉంది.

పురుషుల సింగిల్స్‌ డ్రా :

గ్రూప్‌ ‘ఎ – విక్టర్‌ అక్సెల్సెన్‌(డెన్మార్క్‌), చౌ తీన్‌ చెన్‌(చైనీస్‌ తైపి), లీ జి జియా(మలేసియా), ఆంథోని గింటింగ్‌ (ఇండో నేసియా).
గ్రూప్‌ ‘బి – ఆండర్స్‌ ఆంటోన్సెన్‌(డెన్మార్క్‌), వాంగ్‌ జు వీ (చైనీస్‌ తైపి), కిడాంబి శ్రీకాంత్‌(ఇండియా), ఎంగ్‌ కా లాంగ్‌(హాంకాంగ్‌).

మహిళల సింగిల్స్‌ డ్రా :

గ్రూప్‌ ‘ఎ – కరోలిన్‌ మారిన్‌(స్పెయిన్‌), అన్‌ సె యంగ్‌(దక్షిణ కొరియా), మిచెల్లి లీ(కెనడా), ఎవజెనియ కొసెత్సకయ(రష్యా).గ్రూప్‌ ‘బి – తై జు యింగ్‌(చైనీస్‌ తైపీ), రచానక్‌ ఇంతనన్‌(థాయిలాండ్‌), పొర్నపవీ చొచె వాంగ్‌(థాయిలాండ్‌), పి.వి.సింధు(ఇండియా).

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/