ఇంటర్మీడియట్ లో 70% సిలబస్‌


ఇంటర్‌బోర్డుకు లేఖ పంపించిన సీబీఎస్‌ఈ
త్వరలోనే నిర్ణయం తీసుకొనే అవకాశం

హైదరాబాద్ : రాష్టంలో విద్యాసంవత్సరానికి (2021-22 ) కూడా ఇంటర్మీడియట్‌లో 70 శాతం సిలబస్‌ను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఖరారుచేసింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్‌బోర్డుకు లేఖను పంపించింది. 70 శాతం సిలబస్‌ అమలుకు అనుమతినివ్వాలని కోరుతూ ఇంటర్‌బోర్డు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. గతేడాది 30 శాతం తగ్గించి, 70 శాతం సిలబస్‌ను ఖరారుచేశారు. ఈ విద్యాసంవత్సరం కూడా అదే అమలుచేయనున్నారు. గతేడాది సిలబస్‌ను ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరచగా.. ఆ సిలబస్‌కే 2022 మార్చి/ ఏప్రిల్‌ నెలల్లో ఫస్టియర్‌, సెంకడియర్‌ పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది.

కరోనా ఈ విద్యాసంవత్సరంపైనా తీవ్ర ప్రభావం చూపింది. జూన్‌ 1న ప్రారంభంకావాల్సిన ఇంటర్‌ కాలేజీలు సెప్టెంబర్‌ ఒకటి నుంచి తెరుచుకున్నాయి. 280 రోజులపాటు కాలేజీలు నడవాల్సి ఉండగా.. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ కలుపుకొంటే 220 రోజులు మాత్రమే క్లాసులు జరగనున్నాయి. కరోనా మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో విద్యార్థుల సౌలభ్యం దృష్ట్యా ఈ విద్యాసంవత్సరం సైతం 70 శాతం సిలబస్‌నే కొనసాగించడం ఉత్తమమన్న వాదనలువచ్చాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/