హైటెక్ సిటీలో సరికొత్త హంగులతో ఇంటరాక్టివ్ సైన్స్ పార్క్ ఏర్పాటు

GHMC కీలక నిర్ణయం తీసుకుంది. హైటెక్ సిటీలో సరికొత్త హంగులతో ఇంటరాక్టివ్ సైన్స్ పార్క్ ఏర్పాటు చేయబోతుంది. హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ సమీపంలో పత్రికానగర్‌లోని మెడికోవర్ ఆసుపత్రి వద్ద ఏర్పాటు ఈ పార్క్ ను దాదాపు మూడు ఎకరాల్లో ఏర్పటు చేస్తున్నారు. ఈ సైన్స్ పార్క్‌లో ఉచిత వైఫై సదుపాయంతో పాటు ఉద్యోగులు తమ లాప్‌ట్యాప్‌లు తెచ్చుకుని వర్క్ చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక స్థలం కేటాయించడంతో పాటు ఛార్జింగ్ పాయింట్లు నెలకొల్పనున్నారు.

ఈ పార్క్‌లో అన్ని వయస్సుల వారికి వినోదం కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నారు. చిన్న పిల్లలకు ప్రత్యేక ప్లే గ్రౌండ్‌తో పాటు ఓపెన్ జిమ్ అందుబాటులో ఉంచనున్నారు. ఇక సీనియర్ సిటిజన్లు, విగలాంగుల కోసం ర్యాంప్‌లు, వాకింగ్ కోసం ట్రాక్, సీటింగ్ ఏర్పాట్లు, వాష్‌రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే పార్క్‌లో ఫుడ్ కోర్టులు కూడా ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఐటెక్ సిటీ సమీపంలో ఐటీ కంపెనీలతో పాటు హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, హాస్పిటళ్లు ఉన్న నేపథ్యంలో ఈ సైన్స్ పార్క్ అందరికీ ఉపయోగపడుతుందని జీహెచ్‌ఎంసీ అధికారులు భావిస్తున్నారు. అతి త్వరలోనే దీనిని ప్రారంభించనున్నట్లు తెలిపారు.