ఇంటర్ ద్వితీయ పరీక్షలు రద్దు..మంత్రి సబిత

15 రోజుల్లో ఫలితాల ప్రకటన

హైదరాబాద్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రద్దు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పరీక్షలను రద్దు చేసినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది.

కాగా, ఫస్టియర్ మార్కుల ఆధారంగానే సెకండియర్ విద్యార్థుల ఫలితాలు ఉంటాయని పేర్కొన్న మంత్రి.. ఇందుకోసం అధికారులతో ఓ కమిటీని నియమించనున్నట్టు తెలిపారు. ఫస్టియర్‌లో ఫెయిలైన విద్యార్థులకు కనీస పాస్ మార్కులు వేయాలని నిర్ణయించారు.

విద్యాశాఖ కార్యదర్శి సుల్తానియా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ విద్య కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పాఠశాల విద్య సంచాలకురాలు శ్రీదేవసేనతో నిన్న సాయంత్రం ఇంటర్ బోర్డు కార్యాలయంలో నిర్వహించిన సమావేశం అనంతరం ప్రభుత్వం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల రద్దుకు సంబంధించిన ప్రకటన చేసింది.

అయితే, పరీక్ష రాయాలనుకున్న విద్యార్థులకు మాత్రం కరోనా తగ్గుముఖం పట్టాక నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇంటర్ సెకండియర్ విద్యార్థులు మొత్తం పాసైనట్టే. నిబంధనల ప్రకారం 15 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించేందుకు ఇంటర్ బోర్డు సమాయత్తమవుతోంది.

తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/videos/