ఇంటర్‌ పరీక్ష: నిమిషం ఆలస్యమైనా అనుమతి నో..

ఉదయం 8.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్‌ పరీక్ష

సౌకర్యాల కల్పనలోఅలసత్వం వహిస్తే కఠిన చర్యలు : మంత్రి సబిత

Minister SABITA INDRA REDDY

హైదరాబాద్‌: రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు నిమిషం ఆలస్యం అయినా అనుమతించబోమని… విద్యార్థులు 9 గంటల లోపుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్‌ స్పష్టం చేశారు.

పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఒత్తిడికిలోను కాకుండా ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎవరైనా ఒత్తిడికి గురైనట్టు భావించినా.. పరీక్షలంటే భయపడుతున్నా అటువంటి విద్యార్థులు కౌన్సిలర్ల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచించారు.

ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశామని అలాగే ప్రతి కాలేజీలోనూ విద్యార్థి కౌన్సిలర్లను కూడా నియమించినట్టు తెలిపారు. పరీక్షలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

4 నుంచి ప్రారంభమయ్యే పరీక్షల్లో ఏ ఒక్క విద్యార్థి కింద కూర్చుని పరీక్ష రాసినట్టు తెలిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు.

మీడియా సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్‌, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌, సీజీజీ డైరక్టర్‌ జనరల్‌ రాజేంద్ర నిమ్జే తదితరులు పాల్గొన్నారు.

జిల్లాస్థాయిలో పరీక్షల నిర్వహణ కోసం కలెక్టర్‌ చైర్మన్‌గా హైపవర్‌ కమిటీ, మరో కమిటీజిల్లా పరీక్షల కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరీక్షలను సమర్ధవంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

హైదరాబాద్‌తోపాటు, జిల్లాకేంద్రాల్లోనూ ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. పోలీస్‌, పోస్టల్‌, ఆర్‌టీసీ, విద్యుత్‌, వైద్యశాఖ, రెవిన్యూ తదితర శాఖలతో సమన్వయం చేసుకొని ఎటువంటి ఇబ్బందులు రాకుండా పరీక్షలను నిర్వహించనున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,65,875 మంది హాజరు కానున్నారు.

వీరి కోసం 1339 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 26,964 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్‌ బోర్డులో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

ఇందుకు సంబంధించి విద్యార్థులు,ఇతరులు 040-24601010, 24732369 నం బర్లు అందుబాటులో ఉంటాయని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి తెలిపారు. విద్యార్థు లకు కౌన్సిలింగ్‌ ఇవ్వడంకోసం డాక్టర్‌ అనితను నియమించామని విద్యార్థులు 7337225803కు డయల్‌చేసి ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/