అసని తూఫాన్ ఎఫెక్ట్ : ఏపీలో ఇంటర్ పరీక్ష వాయిదా

బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తూఫాన్ కారణంగా ఏపీలో రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్షను వాయిదా వేశారు. రేపు అసని తుఫాను తీరం దాటే అవకాశం ఉండడంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో.. రేపు ఏపీలో నిర్వహించాల్సిన ఇంటర్‌ పరీక్షను వాయిదా వేయిస్తున్నట్లు ఏపీ విద్యా శాఖ వెల్లడించింది. రేపు వాయిదా వేసిన పరీక్షను ఈనెల 25న నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో తుఫాన్‌ ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షలు ఈ నెల 6న ప్రారంభమయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి మొత్తం 9లక్షల 14వేల 423 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘అసని’ దిశ మార్చుకుంది. ఉత్తర కోస్తా- ఒడిశా మధ్యలో తీరం దాటుతుందనుకున్న తుపాను.. కృష్ణా జిల్లా మచిలీపట్నంవైపు దూసుకొస్తోంది. రేపు సాయంత్రలోపు మచిలీపట్నానికి సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నట్లు వాతావరణశాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది. మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకి మళ్లీ విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశించే అవకాశముందని ఐఎండీ భావిస్తోంది.