హైదరాబాద్ కు భారీ వర్ష సూచన : నగరవాసులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

హైదరాబాద్ నగరాన్ని వరణుడు వదలడం లేదు. ప్రతి రోజు భారీ వర్షం కురుస్తుంది. ఈరోజు ఉదయం నుండి కూడా భారీ వర్షం కురుస్తుంది. మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురువనుందని నగరవాసులంతా అప్రమత్తంగా ఉండాలని GHMC హెచ్చరించింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, మాదాపూర్‌, కొండాపూర్‌, మియాపూర్‌ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఎల్బీనరగ్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, ఉప్పల్‌ చిలుకానగర్‌, రామంతపూర్‌, మణికొండ, పుష్పాలగూడ, కాటేదాన్‌, రాజేంద్రనగర్‌, నార్సింగి, అత్తాపూర్‌, గండిపేటలో వాన పడుతోంది. ఆఫీసులకు, విద్యాసంస్థలకు వెళ్లే సమయంలో భారీ వర్షం పడుతుండటంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు గంటలపాటు నగర వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని , రోడ్ల పైకి రావొద్దని , వర్షం తగ్గినా గంట తర్వాత ఇళ్ల నుండి బయటకు రావాలని సూచించారు. ప్రధాన మార్గాల్లో రోడ్లపైకి వరదనీరు చేరి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే అవకాశముందని చెప్పారు. కొంత సమయం ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని.. కొన్ని ముఖ్యమైన రోడ్లలో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడిన ఉపరతల ద్రోణి కారణంగా హైదరాబాద్​లో భారీ వర్షం కురుస్తోంది. కుండపోత వర్షాలతో రహదారులపై వర్షపు నీరు నిలిచిపోతోంది. రోడ్లన్నీ చెరువులుగా మారి వాహనదారులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపిలేని వానతో నగర వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.