టాలీవుడ్ హీరో రెస్టారెంట్లో నిబంధనలు ఉల్లంఘన..!!

హైదరాబాద్ నగరంలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. అవుట్‌సైడ్‌ ఫుడ్‌పైనే అత్యధికంగా ఆధారపడే ఆహార ప్రియుల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇటీవల వరుస దాడులతో హోటళ్లు, రెస్టారెంట్లు, బార్‌ల నిజస్వరూపం బయటపడుతుంది. నోరూరించే వంటకాలతో.. మెరిపించే అలంకరణలతో ఆహార ప్రియులను తియ్యగా మోసం చేసిన హోటల్స్‌.. నగరవాసుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. ఇటీవల కేఎఫ్‌సీ, కృతుంగ, రెస్టో బార్‌లోనూ.. నాణ్యతలేని ఆహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రముఖ హీరో సందీప్ కిషన్ హోటల్లో కూడా సోదాలు చేపట్టారు. కాగా, విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. సందీప్ కిషన్ వివాహ భోజనంబు పేరుతో ఓ హోటల్ నిర్వహిస్తున్న సంగతి విదితమే. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో బ్రాంచీలు ఉన్నాయి. వాటిల్లో సికింద్రాబాద్‌ ఫ్రాంచైజీ ఒకటి. అక్కడి హోటల్లో సోదాలు చేపట్టారు అధికారులు. పాడైన పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వండిన పదార్థాలను ప్రిజ్‌లో నిల్వ చేసి.. తిరిగి అవే కస్టమర్లకు అందిస్తున్నట్లు తేలింది. అంతేకాకుండా కిచెన్‌లో కూడా అపరిశుభ్రత రాజ్యమేలుతున్నట్లు పేర్కొన్నారు అధికారులు. చిట్టి ముత్యాలతో పాటు పలు అవుటేడెట్ ఫుడ్ పదార్ధాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దీనిపై నోటీసులు జారీ చేసారు.

ఇక ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దెబ్బతో చాలా మంది వీకెండ్స్‌ డిన్నర్‌, లంచ్‌ ప్రోగ్రాంలు రద్దు చేసుకుంటున్నారు. పిల్లలతో కలిసి బయటకు వెళ్లి సందర్శన ప్రాంతాలను వీక్షించి లంచ్‌, డిన్నర్‌లు ఇష్టమైన రెస్టారెంట్‌లో తినేసి ఇంటికి వెళ్తుంటారు. కానీ ఇటీవల నగరంలో కుళ్లిన వంటకాలు హోటల్స్‌లో వడ్డిస్తున్నారనే విషయం బయటకు రావడంతో వాళ్లంతా బయట ఆరగించడానికి సంశయిస్తున్నారు. ఏ హోటల్‌, రెస్టారెంట్‌ను చూసినా అనుమానంగా చూసే పరిస్థితి వచ్చింది. అనారోగ్యం కొని తెచ్చుకోవడం ఎందుకని ఆలోచిస్తున్నారు.