హర్యానాలో భారీ ర్యాలీకి రావాల్సిందిగా కేసీఆర్ , చంద్రబాబు లకు ఐఎన్ఎల్‌డీ ఆహ్వానం

ఈ నెల 25న హరియాణలో తాము నిర్వహించనున్న భారీ ర్యాలీకి రావాల్సిందిగా తెలంగాణ సీఎం కేసీఆర్‌, టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు సహా దేశవ్యాప్తంగా పలువురు కీలక నేతలను ఆహ్వానించామని ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డీ) జాతీయ ప్రధాన కార్యదర్శి అభయ్‌ చౌతాలా వెల్లడించారు. భారత మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్‌డీ) ఈ నెల 25న హర్యానాలో భారీ ర్యాలీ నిర్వహించనుంది.

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులను ఆహ్వానించినట్టు అభయ్ చౌతాలా తెలిపారు. ర్యాలీకి హాజరవుతామని నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్ హామీ ఇచ్చారని చెప్పారు. దేవీలాల్‌ జయంతి సందర్భంగా ఈ 25న ప్రతిపక్షాలన్నీ ఒకతాటిపైకి వచ్చి పలు సమస్యలపై చర్చించనున్నట్లు జేడీయూ నేత కేసీ త్యాగి వివరించారు. బీజేపీతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని ఐఎన్‌ఎల్‌ డీ చీఫ్‌ ఓపీ చౌతాలా అభిప్రాయపడ్డారు.