నాసిరకం ఆహారం.. ఆరోగ్యానికి చేటు

nferior Diet

ఆకలితోనో, ఇంట్లో వంట చేసుకునే పరిస్థితి లేకనో, పుట్టిన రోజు, పెండ్లి రోజు ఏదైన సందర్భంగా పిల్లలతోకలిసి బయట తినాలని భావించే నగర ప్రజలకు చేదు అనుభవమే ఎదురవ్ఞతుంది. నగర పాలకవర్గం అసమర్థతతో గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు ప్రధాన నగరాల్లో కల్తీఫుడ్‌ మాఫియా చెలరేగిపోతుంది. నోరూరించే రుచులు ఘుమఘుమల నడుమ విషపు ఆహారం రాజ్యమేలుతోంది. విశ్వనగరంలో పైపై మెరుగు లతో ఆకట్టుకుంటున్న చాలా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌ కోర్టులు ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నాయి. బయటకు కనపడే ఫోటోలు, డేకరేషన్‌ను చూసి లోపలికి వెలు తున్న భోజన ప్రియులు అక్కడ దొరికే ఆహారాన్ని తిని ఆస్పత్రి పాలవ్ఞతున్నారు. ఇంటి వంటకు భిన్నంగా ఉంటుందనో, ఇతర కారణాలతోనే బయటి ఆహారంపై ఆధారపడితే అనారోగ్యంపాలై జేబులకు చిల్లుపడుతుందని నగరజనం వాపోతున్నారు.

ధరల విషయంలోనే కాదు, ఇతర చార్జీల రూపంలో సిటీ జనం హోట ల్స్‌, రెస్టారెంట్లకు వెలితే చాలు అడ్డగోలుగా దండుకుంటున్నారు. అయితే గతంలో బల్దియా అధికారులు హోటల్స్‌ రెస్టారెంట్లపై వరుసగా దాడి చేసి ఫైన్లు వేసి చేతులు దులుపుకున్నరే తప్ప నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకున్న పాపాన పోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే దాదాపు 700 పైగా హోటల్స్‌ రెస్టారెంట్లలో గతంలో తనిఖీలు చేసి 16 లక్షల వరకు జరిమానా వేశారు. ఆ తర్వాత వాటివైపు మళ్లీ చూసిన పరిస్థితే లేకుండాపోయింది. మరోవైపు కల్తీ ఫుడ్‌కు చెక్‌పెట్టడానికి ఒక యాప్‌ను రూపొందించారు. కానీ వాటికి వచ్చే ఫిర్యాదులను స్వీకరించడం మానివేసి చేతులు దులుపుకున్నారు.

దాంతో అధికారులు, పాలకుల తీరుతో ఈ హోటళ్లలో యాప్‌కు సైతం రెస్పాన్స్‌ కరువైంది. హెల్‌ అధికారులు, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ల మధ్య సమన్వయం కుదరకపోవడంతో ఆ హోటల్‌ యాప్‌ నిర్వహణను గాలికి వదిలేశారు. హైదరాబాద్‌ నగరం విశ్వనగ రంగా ఎదుగుతున్న గ్రేటర్‌ హైదరాబాద్‌కు ప్రతిరోజు వేలాది మంది టూరిస్టులు వస్తుంటారు. ఇక్కడ పర్యాటక ప్రదేశాలతో పాటు హైదరాబాద్‌ బిర్యానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. దీంతో నేటికీ వచ్చిన టూరిస్టులతో పాటు, నగర ప్రజలు తరచుగా హోటల్స్‌, రెస్టారెంట్లలో తినడానికి ఆసక్తి చూపుతుంటా రు. నాసిరకం నూనెలు, ఇతర పదార్థాలు వాడటంతో ఆ ఆహారం స్లోపాయిజన్‌గా పనిచేస్తూ ప్రజల ధన, ప్రాణాలను తోడేస్తుంది. నాసిరకం వంటలు తిన్న ప్రజలు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ దీర్ఘకాలిక రోగాలపాలై అవస్థలు పడుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

ఎప్పటికప్పుడు హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు ఆహార పరిశ్రమలు, డైరీఫారాల నుంచి నమూనాలు సేకరించి నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు ఆహార తనిఖీ అధికారులతో ఓ వ్యవస్థ ఉంటుంది. ఈ పనులను ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు చూడాల్సి ఉంటుంది. కానీ ఈ అధికారుల కొరత రాష్ట్రంలో తీవ్రంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు ఆరు సంవత్సరాలు గడుస్తున్నా పాలకులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దాంతో రాష్ట్ర ప్రజల ధన, ఆరోగ్య ప్రాణాలకు భద్రత కరవై శాపంగా మారింది. విశ్వనగరంగా ఎదుగుతున్న నగర ప్రజలకు గ్రేటర్‌ బల్దియా ఆహార భద్రత అందించలేక చతికిలపడిపోతుంది.

కోటి జనాభాకు ఆహార భద్రత అందిం చేందుకు ఇక్కడ ఉన్నది ముచ్చటగా ముగ్గురే. ఇప్పటి వరకు జిహెచ్‌యంసిలో అధికారికంగా 2881 హోటళ్లు ఉండగా అనాధి కారికంగా చిన్నపాటి టిఫిన్‌ సెంటర్లు, బండ్లు కలిపి మరో 3800 ఉంటాయి. ఇక్కడ నాణ్యత ప్రమాణాలతో ప్రజలకు ఆహార పదార్థాలు అందుతున్నాయా లేదా చూడాల్సిన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు మాత్రం ముగ్గురే. రోజుకు ఒక్కో సర్కిల్‌ నుంచి కనీసం దాదాపు 5,7 ఫిర్యాదులు వస్తుంటాయి. నగరంలోకి ఐదు జోన్లలో మొత్తం 30 సర్కిళ్లున్నాయి. అంటే 1500 ఫిర్యాదులు అందుతుంటాయని అంచనా.

ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఫిర్యాదులను కూడా పట్టించుకోని వైనం. అయితే గ్రేటర్‌ పరిధిలోని ఆరు జోన్ల కుగాను ముగ్గురే అధికారులు మాత్రమే ఉన్నారు. దాంతో కేవలం సెంట్రల్‌, ఈస్టు, సౌత్‌, జోన్లకు మాత్రమే పరిమితమవ్ఞతున్నారు. వెస్ట్‌జోన్‌ నార్త్‌జోన్‌లను పూర్తిగా నిర్లక్ష్యంగా గాలికివదిలేశారన్న ఆరోపణలున్నాయి. ఇక కొన్ని హోటళ్లు వేడి వేడి వంటకాలు క్షణాల మీద ముందుకు తెస్తున్నాయి. రుచి, శుద్ధి, శుభ్రతకు మేము మారం అంటూ డబ్బాలు గొప్పలు కొట్టుకునే హోటళ్లల్లో కల్తీ వంటకాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక బిర్యాని పాయింట్ల గురించి చెప్పక్కర్లేదు. రోడ్లపై వెలుస్తున్న ఫాస్ట్‌ఫుడ్స్‌ సెంటర్లతో పాటు కొన్ని పెద్ద పెద్ద హోటళ్ల యజమానులు వంటకాల తయారీలో కల్తీ నూనెలు వాడుతున్నారు.

నాసిరకం నూనెల వల్ల కేన్సర్‌కు దారితీస్తుంది. రోడ్లపై వెలుస్తున్న బేకరీలు, కర్రి పాయింట్లు, టిఫిన్‌సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో వంటగదులు శుభ్రంగా ఉండవ్ఞ. కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా వాటర్‌ బాటిల్‌ కొనుక్కోమంటున్నారు. వినియోగదారునికి మంచినీళ్లకు కూడా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. గ్రేటర్‌ బల్దియా ఖాళీలను భర్తీ చేయాలని గతంలో ప్రభుత్వం కోరడంతో పోస్టులను భర్తీ చేసేందుకు టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్‌ వేసినా ఇప్పటివరకు నియామకాల ప్రక్రియ మూలనపడింది. గ్రేటర్‌లోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా వీరి కొరతతో కల్తీ రాజ్యమేలుతోంది. ఇకనైనా గ్రేటర్‌కు కావాల్సిన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లను వెంటనే భర్తీ చేసి కల్తీని నిరోధించాలి. కల్తీ చేసే హోటళ్లను సీజ్‌ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి.

-మన్నారం నాగరాజు, (రచయిత: రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ)

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/