ఇండోర్ ప్రదేశాలు, వెంటిలేషన్ లేని ప్రదేశాల్లోనే వ్యాప్తి

స్పష్టతనిచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

corona - World Health Organization
corona – World Health Organization

లండన్‌: కరోనా వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాపిస్తోందని, ఈ మేరకు ప్రపంచవ్యాప్త మార్గదర్శకాలను సవరించాలంటూ వందలాది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)ను కోరుతున్నారు. దీనిపై సమీక్ష జరిపిన డబ్ల్యూహెచ్ఓ కరోనా వైరస్ గాల్లో వ్యాపించేందుకు ఉన్న అవకాశాలను వెల్లడించింది. ఇండోర్ ప్రదేశాలు, వెంటిలేషన్ సరిగా లేని ప్రదేశాలు, రెస్టారెంట్లు, జిమ్ లు, బృందగానం చేసే ప్రదేశాల్లో వైరస్ గాల్లో వ్యాపిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయని పేర్కొంది.

ఇప్పటివరకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్న కరోనా రోగులకు శ్వాస యంత్రాలు అమర్చినప్పుడు మాత్రమే వైరస్ గాల్లోకి వ్యాపిస్తుందన్న భావనలో డబ్ల్యూహెచ్ఓ ఉంది. ఇటీవలే అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన పరిశోధకులు కరోనా సోకిన వ్యక్తులు మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వైరస్ తో కూడిన తుంపరలు గాల్లోనే కొంతసేపు ఉంటాయని, ఈ విధంగానూ కరోనా వ్యాపిస్తుందని ఓ అధ్యయనంలో పేర్కొన్నారు. ఇప్పుడీ అధ్యయనాలను డబ్ల్యూహెచ్ఓ అంగీకరించింది. అంతేకాదు, లక్షణాలు లేని వ్యక్తుల కంటే లక్షణాలు ఎక్కువగా ఉన్న వ్యక్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపరల కారణంగానే గాల్లో వ్యాప్తి సాధ్యమవుతుందని తెలిపింది. లక్షణాలు లేని వారి నుంచి వైరస్ ఏ విధంగా సంక్రమిస్తుందన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదని వెల్లడించింది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/