భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందిః రాహుల్ గాంధీ
తనతో పాటు చాలా మంది నేతల ఫోన్లలో పెగాసస్ చొప్పించారన్న రాహుల్

కేంబ్రిడ్జ్: భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశ ప్రజాస్వామ్య ప్రాథమిక నిర్మాణం దాడికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు సంస్థాగత నిర్మాణం అవసరమని అభిప్రాయపడ్డారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న రాహుల్ శుక్రవారం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై గూఢచర్యం చేసేందుకు ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ ను ఉపయోగిస్తోందని ఆయన అన్నారు.
కేంబ్రిడ్జ్ జడ్జి బిజినెస్ స్కూల్ విద్యార్థులకు ‘లెర్నింగ్ టు లిసన్ ఇన్ ది 21వ శతాబ్దం’ అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. ‘భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది. మేం ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాము’ అని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై గూఢచర్యం చేయడానికి పెగాసస్‌ను ఉపయోగించిందని అన్నారు.
‘నా ఫోన్‌లో పెగాసస్ స్పైవేర్ చొప్పించారు. చాలా మంది రాజకీయ నాయకుల ఫోన్లలోనూ పెగాసస్ ఉంది. ఫోన్‌లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నాకు చెప్పారు’ అని రాహుల్ అన్నారు. దేశంలో మీడియాను, న్యాయవ్యవస్థను కబ్జా చేసి, నియంత్రిస్తున్నారని ఆరోపించారు. ఇతరులపై నిఘా, బెదిరింపులు, మైనారిటీలు, దళితులు, గిరిజనులపై దాడులతో ప్రభుత్వంపై అసమ్మతిని అణగదొక్కుతున్నారని విమర్శించారు. కాగా, రాహుల్ గాంధీ యూకేలో వారం రోజుల పాటు పర్యటిస్తారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బిగ్ డేటా, ప్రజాస్వామ్యం, భారతదేశం-చైనా సంబంధాలపై నిపుణులతో నిర్వహించే సమావేశాల్లో పాల్గొంటారు.