విజయవంతంగా జీశాట్-31 ప్రయోగం

కౌరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తాజాగా మరో ఘనతను సాధించింది. ఏరియానా స్పేస్ రాకెట్ ద్వారా ఫ్రెంచ్ గయానాలోని కౌరు లాంచ్ కాంప్లెక్స్ నుంచి భారత కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్ 31 విజయవంతంగా నింగిలోకి పంపింది. భారత కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారు జామున 2.31 గంటలకు జీశాట్ 31 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకుపోయిన ఏరియానా రాకెట్ 42 నిమిషాల్లోనే కక్ష్యలోకి చేర్చింది. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ఈ ఉపగ్రహం కమ్యూనికేషన్ సేవలను అందించనుంది. జీశాట్ 31తో పాటు సౌదీకి చెందిన 1 హెల్లాస్ శాట్ 4 ఉపగ్రహం కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తంచేశారు. 15 ఏళ్ల పాటు నిరాటంకంగా సమాచార సేవలందించే సామర్థ్యం కల్గిన ఈ ఉపగ్రహం బరువు 2,535 కిలోలు. అత్యంత సమర్థమంతమైన కేయూ బ్యాండ్ ప్రసార వ్యవస్థ ఉన్న జీశాట్ 31 ఇస్రో సంప్రదాయ ఉపగ్రహాలైన ఇన్శాట్, జీశాట్లకు ఆధునిక రూపమని నిపుణులు చెబుతున్నారు. భారతీయ భూభాగాలు, ద్వీపాలతో పాటు అరేబియా సముద్రం, బంగాళాఖాతం పరిసరాల సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందిస్తుంది.