స్టేడియంలో అవుట్‌ ఫీల్డ్‌పై ప్రత్యేక కెమికల్‌

మంచు ప్రభావాన్ని అధికమించేందుకే అంటున్న ఎంపిసిఏ

Holkar Stadium
Holkar Stadium

ఇండోర్‌: ఈ సంవత్సరంను విజయంతో ప్రారంబించాలనుకున్న టీమిండియా ఆశలను గువాహటిలో వరుణుడు ఆవిరి చేశాడు. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో.. భారత్‌శ్రీలంక జట్లు రెండో టీ20 మ్యాచ్‌పై దృష్టి పెట్టాయి. మూడు టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం హోల్కర్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. ప్రస్తుతం శీతాకాలం కాబట్టి మంచు ప్రభావం అధికంగా ఉంటుంది. మొదటగా బౌలింగ్ చేసే జట్టుకు ఇబ్బంది ఏమీ లేకపోయినా.. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసే జట్టుకు మంచు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి బౌలర్లకు బంతిపై పట్టు దొరకదు. ఈ కారణంతో టాస్ గెలిచిన ఏ కెప్టెన్ అయినా.. మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకుంటాడు. అయితే ఇండోర్‌ టీ20లో ఈ మంచు సమస్యను అధిగమించేందుకు మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం (ఎంపిసిఏ) చీఫ్‌ క్యూరేటర్‌ సమందర్‌ సింగ్‌ కొన్ని చిట్కాలు పాటిస్తున్నాడు. మంచు ప్రభావాన్ని తగ్గించేందుకు అవుట్‌ ఫీల్డ్‌పై ప్రత్యేక కెమికల్‌ను చల్లుతున్నట్లు తెలిపాడు. గత మూడు రోజుల నుంచి ఇదే విధంగా చేస్తున్నామని పేర్కొన్నాడు. మైదానంలోని గడ్డిపై నీళ్లు కూడా చల్లడం లేదని ఆయన చెప్పుకొచ్చాడు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/