మయాంక్‌ అగర్వాల్‌ డబుల్‌ సెంచరీ


భారత్ స్కోరు 5 వికెట్లకు 436 రన్స్

Mayank-Agarwal
Mayank-Agarwal

విశాఖపట్నం: విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అద్భుతమైన రీతిలో డబుల్ సెంచరీ సాధించాడు. పట్టుమని పది టెస్టుల అనుభవం కూడా లేని మయాంక్ దక్షిణాఫ్రికా వంటి పటిష్టమైన జట్టుపై సెంచరీ సాధించడమే గొప్ప అనుకుంటే, అద్వితీయమైన రీతిలో 200 పరుగులు పూర్తిచేసి సగర్వంగా అభివాదం చేశాడు. దూకుడుకు సంయమనం జోడించి, అద్భుతమైన టెక్నిక్ మేళవించి సఫారీలను ఎదుర్కొన్న ఈ కర్ణాటక యువకిశోరం టీమిండియాకు సుదీర్ఘకాలం సేవలందించే సత్తా తనలో ఉందని చాటుకున్నాడు. తన తొలి సెంచరీనే ‘డబుల్’ గా మలుచుకుని చిరస్మరణీయం చేసుకున్నాడు. మయాంక్ అగర్వాల్ 215 పరుగుల స్కోరు వద్ద పార్ట్ టైమ్ బౌలర్ డీన్ ఎల్గార్ బంతికి వెనుదిరిగాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా, హనుమ విహారి క్రీజులో ఉన్నారు. రెండో రోజు ఆట మధ్యాహ్నం సెషన్ లో భారత్ 5 వికెట్లు కోల్పోయి 436 పరుగులతో ఆడుతోంది.

అంతకుముందు, రెండో రోజు ఉదయం ఆటలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 176 పరుగుల భారీస్కోరు చేసి తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. పుజారా 6, కెప్టెన్ విరాట్ కోహ్లీ 20 పరుగులు చేసి అవుటయ్యారు. రహానే 15 పరుగుల వద్ద వెనుదిరగడంతో టీమిండయా నాలుగో వికెట్ కోల్పోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్పిన్నర్ కేశవ్ మహరాజ్ 2, మరో స్పిన్నర్ ముత్తుస్వామి సేనురాన్ 1, పేసర్ ఫిలాండర్ 1, ఎల్గార్ 1 వికెట్ తీశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/