ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభం

భారత 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ శనివారం ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ తర్వాత లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. రాత్రి కల్లా ఫలితం వెలువడే అవకాశముంది. ఎన్డీఏ కూటమి త‌ర‌పున ప‌శ్చిమ బెంగాల్ మాజీ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్‌, విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గ‌రెట్ అల్వా పోటీలో ఉన్నారు. ఈ ఎన్నిక‌కు దూరంగా ఉండాల‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యం తీసుకుంది. టీఎంసీ మిన‌హా 744 మంది స‌భ్యులు ఓటింగ్‌లో పాల్గొన‌నున్నారు.

ప్రస్తుత ఉప రాష్టపతి ఎం. వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగిసిపోనుంది. 80 ఏళ్ల వయసున్న మార్గరెట్‌ ఆల్వా కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకురాలు . రాజస్థాన్‌ గవర్నర్‌గా పని చేశారు. 71 ఏళ్ల వయసున్న జగ్‌దీప్‌ రాజస్థాన్‌కు చెందిన జాట్‌ నాయకుడు. మార్గరెట్‌ ఆల్వాకు కాంగ్రెస్‌, ఎన్సీపీ, డీఎంకే, టీఆర్‌ఎస్‌, ఆప్‌ మద్దతు తెలుపుతున్నాయి.

జేడీయూ, వైఎస్సార్‌సీపీ, బీఎస్పీ, ఏఐఏడీఎంకే, శివసేన వంటి ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఎన్డీయే అభ్యర్థికి 515 ఓట్లు పోలయ్యే అవకాశాలున్నాయి. టీఎంసీకి లోక్‌సభలో 23 మంది, రాజ్యసభలో 16 మంది సభ్యుల బలం ఉండడం, విపక్ష పార్టీల్లో నెలకొన్న అనైక్యతతో జగ్‌దీప్‌ విజయం దాదాపుగా ఖరారైపోయింది. ఉభయ సభల్లోనూ 788 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అందరూ ఎంపీలే కావడంతో వారి ఓటు విలువ సమానంగా ఉంటుంది. పార్లమెంట్ భవనం మొదటి అంతస్తులోని రూమ్ నెం.63లో సీక్రెట్ బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. పోలింగ్‌ ముగిసిన వెంటనే కౌంటింగ్‌ మొదలుపెట్టి రాత్రికల్లా ఫలితం వెల్లడిస్తారు. లోక్​సభ సెక్రెటరీ జనరల్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ సాగుతుంది.