అటువంటప్పుడు మాకూ అభిప్రాయాలు ఉంటాయి : జైశంకర్

అమెరికాలో మానవ హక్కులపై మేమూ మాట్లాడగలం: జైశంకర్

న్యూఢిల్లీ: భారత్-అమెరికా మధ్య 2ప్లస్2 మంత్రుల సమావేశంలో మానవ హక్కుల అంశం చర్చకు రాలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. ఇరుదేశాల విదేశాంగ,రక్షణ శాఖ మంత్రుల మధ్య వాషింగ్టన్ లో సమావేశం జరగడం తెలిసిందే. భారత్ లో ఇటీవలి కొన్ని ఆందోళనకర పరిణామాలను అమెరికా పర్యవేక్షిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, జైళ్ల సిబ్బంది మానవ హక్కుల ఉల్లంఘనల ఘటనలను బ్లింకెన్ ప్రస్తావించారు. దీంతో బ్లింకెన్ వ్యాఖ్యలకు సంబంధించి జైశంకర్ కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది.

తాజా సమావేశంలో మానవ హక్కులకు సంబంధించి చర్చ జరగలేదని జైశంకర్ స్పష్టత ఇచ్చారు. సైనిక, రాజకీయ పరమైన అంశాలపై చర్చించినట్టు చెప్పారు. ఎప్పుడైనా ఈ అంశం చర్చకు వస్తే భారత్ మౌనంగా ఉండబోదన్నారు. ‘‘భారత్ గురించి అభిప్రాయాలను కలిగి ఉండే హక్కు ఇతరులకు ఉంది. అమెరికా సహా ఇతర ప్రాంతాల్లోని మానవ హక్కుల పరిస్థితిపైనా మాకు కూడా అభిప్రాయాలు ఉంటాయి’’అని జైశంకర్ చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/