జనాభాలో చైనాను అధిగమించిన భారత్ః ఐరాస గణాంకాలు

India to overtake China as world’s most populous country by mid-2023: UN report

న్యూఢిల్లీః భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. చైనాను అధిగమించిన భారత్‌లో ప్రస్తుతం 29 లక్షల మంది అధికంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి గణాంకాలు వెల్లడించాయి. స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ రిపోర్ట్‌, 2023 పేరుతో ఐక్యరాజ్యసమితి పాపులేషన్‌ ఫండ్‌ నివేదికను విడుదల చేసింది. దీనిప్రకారం భారత్‌లో 142.86 కోట్ల మంది జనాభా ఉన్నారని అందులో పేర్కొన్నది. చైనా జనాభా 142.57 కోట్ల మంది అని తెలిపింది. 340 మిలియన్లతో అమెరికా మూడో స్థానంలో ఉందని వెల్లడించింది. అయితే చైనాను భారత్‌ ఎప్పుడు అధిగమించిందనే విషయాన్ని స్పష్టం చేయలేదు. 2023 ఫిబ్రవరి నాటికి అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈ నివేదికను రూపొందించినట్లు తెలుస్తున్నది.

ప్రపంచ జనాభాలో (804.5 కోట్లు) మూడింటా ఒక వంతు ఈ రెండు దేశాల్లోనే ఉన్నదని పేర్కొన్నది. అయితే చైనా జనాభా గతేడాది పీక్‍కు చేరిందని, అప్పటి నుంచి తగ్గుతూ వచ్చిందని, ఇండియా జనాభా మాత్రం పెరుగుతోందని వెల్లడించింది. గత ఆరు దశాబ్దాలో తొలిసారిగా 2022లో చైనా జనాభాలో తగ్గుదల నమోదైంది. అయితే 2011 నుంచి భారతదేశ జనాభా ఏటా సగటున 1.2 శాతం వృద్ధి నమోదవుతున్నదని తెలిపింది.

ఇక భారతదేశ జనాభాలో 0 నుంచి 14 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న వారు 25 శాతం ఉన్నారని, 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులు 18 శాతం, 10 నుంచి 24 ఏండ్ల మధ్య వయస్కులు 26 శాతం ఉన్నారని డేటా వెల్లడించింది. ఇండియాలో 15 నుంచి 64 ఏండ్ల వయసు మధ్య ఉన్న వారు 68 శాతం మంది ఉన్నారని, 65 సంవత్సరాలకు పైబడిన వారు జనాభాలో 7 శాతంగా ఉన్నారని పేర్కొన్నది.