మ‌రోసారి పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన భారత్

న్యూయార్క్‌: ఐరాస భద్రత మండలిలో మ‌రోసారి పాకిస్థాన్‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చింది ఇండియా. భ‌ద్ర‌తా మండ‌లి స‌మావేశాల్లో క‌శ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ ప్ర‌స్తావించ‌డాన్ని ఇండియా త‌ప్పుప‌ట్టింది. యూఎన్‌లోని భార‌త కౌన్స‌ల‌ర్ డాక్ట‌ర్ కాజ‌ల్ భ‌ట్ దీనిపై మాట్లాడుతూ.. పాకిస్థాన్ నుంచి చొర‌బ‌డే ఉగ్ర‌వాదుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఉగ్ర‌వాదం, హింస లేని అనుకూల వాతావ‌ర‌ణంలో మాత్ర‌మే అర్థ‌వంత‌మైన చ‌ర్చ‌ల‌కు ఆస్కారం ఉంటుంద‌న్నారు. పాకిస్థాన్‌తో స‌హా అన్ని దేశాల‌తో ఇండియా సోద‌ర సంబంధాల‌ను ఆశిస్తోంద‌ని, ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే, అవి ద్వైపాక్షిక‌మైనా, సిమ్లా అగ్రిమెంట్‌, లాహోర్ డిక్ల‌రేష‌న్ లాంటి వాటిపైన కూడా శాంతియుతంగా చ‌ర్చించ‌నున్న‌ట్లు కాజ‌ల్ భ‌ట్‌ తెలిపారు. చ‌ర్చ‌ల‌కు అనుకూల‌మైన వాతావ‌ర‌ణాన్ని ఏర్పాటు చేసే బాధ్య‌త‌ పాకిస్థాన్‌పైనే ఉంటుంద‌ని ఆమె అన్నారు. అప్ప‌టి వ‌ర‌కు సీమాంత‌ర ఉగ్ర‌వాదం ప‌ట్ల భార‌త్ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు.

భార‌త్‌పై యూఎన్ వేదిక‌గా పాకిస్థాన్ త‌ప్పుడు ప్ర‌చారాలు చేయ‌డం ఇది మొద‌టిసారి కాదు అని, ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించేందుకు పాక్ అనుచిత వ్యాఖ్య‌లు చేస్తోంద‌ని, కానీ ఆ దేశంలో మాత్రం ఉగ్ర‌వాదులు స్వేచ్ఛ‌గా తిరుగుతున్నార‌ని, సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు, మైనార్టీల‌కు అక్క‌డ ఇబ్బందులు త‌ప్ప‌డం లేద‌ని కాజ‌ల్ అన్నారు. అంత‌ర్జాతీయ శాంతి అంశంపై పాకిస్థాన్ అంబాసిడ‌ర్ మునిర్ అక్ర‌మ్ మాట్లాడుతూ.. క‌శ్మీర్ స‌మ‌స్య‌ను లేవ‌నెత్తారు. ఈ నేప‌థ్యంలో జ‌మ్మూక‌శ్మీర్‌కు చెందిన కాజ‌ల్ భ‌ట్ చాలా తీవ్ర‌స్థాయిలో పాక్‌కు స‌మాధానం ఇచ్చారు. ఉగ్ర‌వాదుల‌ను పెంచి, పోషించే గ‌త చరిత్ర పాకిస్థాన్‌కు ఉంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే అని ఆమె అన్నారు. యూఎన్ భ‌ద్ర‌తా మండ‌లి నిషేధించిన ఉగ్ర‌వాదుల్లో ఎక్కువ మంది పాక్‌లో ఉన్న‌ట్లు కాజ‌ల్ ఆరోపించారు. అక్రమంగా ఆక్ర‌మించిన ప్రాంతాల నుంచి పాక్ వీలైనంత త్వ‌ర‌గా వెళ్లిపోవాల‌ని ఇండియా పిలుపునిచ్చింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/