భారత్ లో తొలి ఒమిక్రాన్ మరణం

రాజస్థాన్: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైంది. మరోవైపు భారత్ లో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన 74 ఏళ్ల వృద్ధుడు ఒమిక్రాన్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు జ్వరం, దగ్గు రావడంతో ఉదయ్ పూర్ లోని మహారాణా భూపాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో డిసెంబర్ 15న చేర్పించారు. డిసెంబర్ 21, 25 తేదీల్లో రెండు సార్లు నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలింది.

డిసెంబర్ 31న ఆయన కన్నుమూశారు. మృతుడు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నారని వైద్యులు తెలిపారు. ఆయన మృతిని కేంద్ర ఆరోగ్యశాఖ ఒమిక్రాన్ మరణంగా అధికారికంగా ప్రకటించింది. దీంతో మన దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించినట్టైంది. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 139 దేశాలకు వ్యాపించిందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు 108 మంది ఒమిక్రాన్ కారణంగా ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. మన దేశంలో కూడా 23 రాష్ట్రాలకు ఈ వేరియంట్ వ్యాపించిందని వెల్లడించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/