కశ్మీర్‌ మా అంతర్గత విషయం..మీ జోక్యం వద్దు

టర్కీ అధ్యక్షుడిని హెచ్చరించిన భారత్

Turkish-President- imran khan-Raveesh Kumar
Turkish-President- imran khan-Raveesh Kumar

న్యూఢిల్లీ: టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ పాకిస్థాన్‌ పర్యటలో ఉన్నారు. ఈసందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో కలసి నిర్వహించిన సమావేశంలో ఎర్డోగాన్ మాట్లాడుతూ.. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కు తాము మద్దతుగా ఉంటామని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని… ఈ వ్యవహారంలో ఇతరులు కలగజేసుకోవద్దని ఎర్డోగాన్ కు భారత్ సూటిగా సలహా ఇచ్చింది. కాగా తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని టర్కీ అధ్యక్షుడికి సూచిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న టెర్రరిజం వల్ల భారత్ కే కాకుండా, ఈ ప్రాంతం మొత్తానికి ప్రమాదం ఉందని… ఈ విషయాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు. భారత్ నుంచి ఈ ప్రతిస్పందన వెలువడిన తర్వాత కూడా ఎర్డోగాన్ మరోసారి అదే మాట మాట్లాడారు. పాకిస్థాన్ కార్యాచరణను తాము సమర్థిస్తున్నామని చెప్పారు.

కశ్మీర్ లోని తమ సోదరసోదరీమణులంతా దశాబ్దాలుగా ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారని… ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో వారి కష్టాలు మరింత ఎక్కువయ్యాయని ఎర్డోగాన్ అన్నారు. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని ఎత్తివేయడాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేవారు. కశ్మీర్ సమస్య పాకిస్థాన్ కు ఎంత ప్రధానమైనదో తమకు అంతే ప్రధానమైనదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యాయం, శాంతి, చర్చల ద్వారానే కశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని… టర్కీ స్టాండ్ ఇదేనని చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్ లో ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల్లో కూడా కశ్మీర్ అంశాన్ని ఎర్డోగాన్ లేవనెత్తడం గమనార్హం. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలను ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ తిప్పికొట్టింది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/