తగ్గుతున్న భారత్ జనాభా: ఎన్హెచ్ఎఫ్ఎస్–5 సర్వే

మంచిది కాదంటున్న నిపుణులు!

న్యూఢిల్లీ : దేశంలో జనాభా తగ్గుతోంది. మునుపటితో పోలిస్తే పుడుతున్న పిల్లల సంఖ్య తగ్గిపోయింది. ‘రీప్లేస్ మెంట్ స్థాయి (జనాభా అటు తగ్గకుండా.. ఇటు పెరగకుండా ఉండే స్థిర స్థాయి)’ కన్నా తక్కువగా సంతాన రేటు నమోదవుతోంది. 2019–21 మధ్య నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే – 5 (ఎన్హెచ్ఎఫ్ఎస్–5)లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రెండు దఫాలుగా ఈ సర్వే చేయగా.. గత ఏడాది డిసెంబర్ లోనే మొదటి దశ సర్వే ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా రెండో దశ ఫలితాలను వెల్లడించింది. అయితే దేశ జనాభా తగ్గడం మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంతో పోలిస్తే సంతాన రేటు (టీఎఫ్ఆర్) 2.0కి పడిపోయిందని సర్వే పేర్కొంది. దాని ప్రకారం దేశంలోని ఒక మహిళ సగటున ఇద్దరు పిల్లలకు జన్మనిస్తోందని వెల్లడించింది. 2015–16లో నిర్వహించిన ఎన్హెచ్ఎఫ్ఎస్–4లో అది 2.2గా ఉండేదని, ఇప్పుడు పడిపోయిందని తెలిపింది. సాధారణంగా టీఎఫ్ఆర్ 2.1 ఉంటే దానిని రీప్లేస్ మెంట్ లెవెల్ అంటారని సర్వే వెల్లడించింది. వాస్తవానికి 1998–99లో 3.2గా ఉన్న టీఎఫ్ఆర్.. రెండు దశాబ్దాల్లో భారీగా పడిపోయింది.

తాజా సర్వేలో ఐదు రాష్ట్రాలు మినహా 32 రాష్ట్రాల్లో సంతాన రేటు రీప్లేస్ మెంట్ రేటు కన్నా తక్కువ స్థాయిలో నమోదైందని పేర్కొంది. బీహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, మణిపూర్ లోనే జనాభా పెరుగుదల ఉందని తెలిపింది. సిక్కింలో సంతాన రేటు అతి తక్కువగా 1.1గా ఉంది. లడఖ్ లో ఐదేళ్ల క్రితం 2.3గా ఉన్న టీఎఫ్ఆర్.. ఇప్పుడు 1.3కి తగ్గిపోయింది. గోవా, అండమాన్–నికోబార్ దీవుల్లోనూ 1.3గా ఉంది. రీప్లేస్ మెంట్ రేటు కన్నా ఎక్కువగా నమోదైన రాష్ట్రాల్లోనూ గతంతో పోలిస్తే టీఎఫ్ఆర్ తగ్గినట్టు సర్వే వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ లో 2.7 నుంచి 2.4కు పడిపోయినట్టు పేర్కొంది. బీహార్ లో 3.4నుంచి 3కి తగ్గిందని తెలిపింది.

18 ఏళ్లు రాకముందే పెళ్లి చేసుకుంటున్న మహిళల సంఖ్య గతంతో పోలిస్తే తగ్గింది. అంతకుముందు సర్వేలో అలాంటి మహిళల సంఖ్య 26.6 శాతంగా ఉండగా.. ఇప్పుడు 23.3 శాతానికి తగ్గింది. ప్రతి ముగ్గురిలో ఒకరు గర్భనిరోధక సాధనాలు వాడడం లేదని తేలింది. అయితే, మొత్తంగా గర్భనిరోధక పద్ధతులను వాడడం మాత్రం అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగిందని తెలిపింది. ఇద్దరు పిల్లల మధ్య వయసు అంతరం కూడా తగ్గుతోందని పేర్కొంది. ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని, గతంలో 79 శాతం ప్రసవాలు ఆసుపత్రిలో జరగ్గా ఇప్పుడది 89 శాతానికి పెరిగిందని తెలిపింది. తమిళనాడులోని పుదుచ్చేరిలో వంద శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని సర్వే వెల్లడించింది.

సంతాన రేటు తగ్గడం దేశానికి మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ.. యువత మీదే ఆధారపడి నడుస్తోందని, 2035 నాటికి యువత తగ్గిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. అప్పటికి దేశంలో యువతకన్నా పెద్దవారే ఎక్కువగా ఉంటారని అంటున్నారు. వాళ్లలో ఎక్కువ మంది నైపుణ్యం కలిగి ఉండి ఉద్యోగాలు చేసినంత వరకు మంచిదేనని, కానీ, ఆ తర్వాత పనిచేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపైనా పడే అవకాశం ఉందంటున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/