భారత్‌ అద్భుతంగా ఆడుతోంది .

న్యూఢిల్లీ: విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రపంచకప్‌లో బాగా రాణిస్తుందని చెప్పాడు టీమిండియా టెస్టు బ్యాట్స్‌మెన్‌ అజింకా రహానె. ఇప్పటికే టెస్టు జట్టులో ప్రధాన ఆటగాడిగా కొనసాగుతున్న రహానె వన్డేల్లోకి రావడానికి తీవ్రంగానే శ్రమిస్తున్నాడు. అయితే ప్రపంచకప్‌లో నాలుగో ఆటగాడిగా చేరేందుకు అతడి పేరు వినిపిస్తున్న నేపథ్యంలో ఐపిఎల్‌లో ప్రదర్శన కీలకంగా మారింది. ఒకవేళ ఈసీజన్‌లో రాణిస్తే ప్రపంచకప్‌ జట్టుతో కలిసి ఇంగ్లాండ్‌ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో రహానె ఓ క్రికెట్‌ ఛానల్‌లో మాట్లాడుతూ…ఇటీవల టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉందని, విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని జట్టు బలంగా కనిపిస్తోందని చెప్పాడు. ఇటీవల మా ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. టీమిండియా ప్రస్తుతం బలంగా కనిపిస్తోందని వ్యక్తిగతంగా భావిస్తున్నా. ప్రపంచకప్‌లో ప్రతీ మ్యాచ్‌ జాగ్రత్తగా ఆడాలి. ఐసిసి టోర్నమెంట్లలో అందరూ అత్యుత్తమంగా ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.అలాగే ప్రపంచకప్‌లో తన ఫేవరెట్‌ జట్లుగా న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ పేర్లను వెల్లడించాడు. టీమిండియా కాకుండా వన్డేల్లో ప్రస్తుతం న్యూజిలాండ్‌ మెరుగ్గా ఉందని, అలాగే వెస్టిండీస్‌ను తక్కువగా అంచనా వేయొద్దని చెప్పాడు. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో తలపడటం అంత తేలికైన విషయం కాదని రహానె పేర్కొన్నాడు. మే 30 నుంచి ప్రారంభంకానున్న ప్రపంచకప్‌లో ఓవల్‌ వేదికగా మొదటి మ్యాచ్‌ ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా మధ్య జరగనుండగా జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

https://www.vaartha.com/news/sports/మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.