అమెరికాకి భారత్ కీలక భాగస్వామిగా నిలిచింది

కరోనాపై చేస్తున్న పోరాటమే సత్సంబంధాలకు నిదర్శనం..అమెరికా విదేశాంగ శాఖ

INDIA, AMERICA
INDIA, AMERICA

వాషింగన్‌: భారత్‌అమెరికా మధ్య ఉన్న బలమైన సత్సంబంధాలపై అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రపంచ ప్రయోజనాల కోసం ఎలాంటి సవాలునైనా ఎదుర్కునే సామర్థ్యం ఇరు దేశాలకు ఉందని తెలిపారు. ఇండోపసిఫిక్ ప్రాంతంతో పాటు ప్రపంచంలోనూ ఇరు దేశాల మధ్య భాగస్వామ్యానికి కరోనాపై చేస్తున్న పోరాటమే నిదర్శనమని చెప్పారు.

కరోనా విజృంభణ ప్రారంభమైన సమయంలో పీపీఈ కిట్లు, మందులు సరఫరా చేయడానికి అమెరికాకి భారత్ కీలక భాగస్వామిగా నిలిచిందని తెలిపారు. కరోనా కట్టడి కోసం భవిష్యత్తులోనూ ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం కొనసాగుతుందని వివరించారు. కరోనాను నిలువరించడంలో ఇది కీలకంగా నిలుస్తుందని తెలిపారు. ఇరు దేశాలు కలిసి పనిచేస్తే ఆయా దేశాలు మరింత బలంగా, సురక్షితంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా మరో సారి భారత్ కొనసాగనుండడం శుభసూచికమని ఆయన అన్నారు. దాని ద్వారా అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించేందుకు భారత్‌తో కలిసి తాము కృషి చేస్తామని తెలిపారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/