అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగించిన భారత్

సెప్టెంబరు 30 వరకూ అమల్లో ఉన్న నిషేధం
అక్టోబరు 31 వరకూ పొడిగిస్తూ డీజీసీఏ నిర్ణయం

న్యూఢిల్లీ : కరోనా కారణంగా భారతదేశంలో అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీన్ని ఈ నెల 30 వరకూ పొడిగిస్తూ కొన్నిరోజుల క్రితం డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మరోసారి ఈ నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. అంతర్జాతీయ విమానాలపై బ్యాన్‌ను అక్టోబరు 31 వరకూ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

వీటిని అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలకు, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌కు, అన్ని ఎయిర్‌పోర్టులకు, ఇమిగ్రేషన్ బ్యూరో కమిషనర్‌కు పంపింది. ఈ నిషేధం కార్గో విమానాలపై వర్తించదని డీజీసీఏ తెలిపింది. అలాగే డీజీసీఏ అనుమతి పొందిన విమానాలపై కూడా ఈ నిషేధం ప్రభావం ఉండబోదని వెల్లడించింది.

కాగా, కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో ఈ ఏడాది అంతర్జాతీయ విమానాలపై డీజీసీఏ బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత డెల్టా వేరియంట్ కారణంగా ఇతర దేశాలు కూడా భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. ఇప్పుడిప్పుడే భారత్ నుంచి వచ్చే విమానాలపై కొన్ని దేశాలు నిషేధాన్ని తొలగిస్తున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/