క్వాడ్‌లో భార‌త్ చోద‌క శ‌క్తిగా ఉంటుంది : అమెరికా

ప్రాంతీయ అభివృద్ధిలోనూ భార‌త్ పాత్ర కీల‌కం అవుతుంద‌ని వ్యాఖ్య‌

వాషింగ్టన్: ఇండో-ప‌సిఫిక్ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు, స్థిరత్వం కోసం భార‌త్‌, అమెరికా, జ‌పాన్‌, ఆస్ట్రేలియా ఏర్పాటు చేసిన‌ చతుర్భుజ దేశాల(క్వాడ్‌) కూటమిలో భార‌త్ పాత్ర‌పై వైట్‌హౌస్ ప్రిన్సిప‌ల్ డిప్యూటీ ప్రెస్ సెక్ర‌ట‌రీ క‌రీన్ జీన్ ఫెర్రీ ప్ర‌శంస‌లు కురిపించారు. మెల్‌బోర్న్‌లో క్వాడ్ దేశాల విదేశాంగ నేత‌లు ఇటీవ‌ల స‌మావేశ‌మై చ‌ర్చించారు. ఇండో- ప‌సిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిప‌త్యం కోసం జ‌రుపుతోన్న ప్ర‌య‌త్నాలు, ఉక్రెయిన్‌పై ర‌ష్యా తీరు అంశాల‌ను కూడా క్వాడ్ స‌మావేశాల్లో చ‌ర్చించారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా, వైట్‌హౌస్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అందులోనే భార‌త్ గురించి క‌రీన్ జీన్ ఫెర్రీ ప్ర‌స్తావించారు. త‌మ వంటి భావ‌జాలం ఉన్న దేశంగా భార‌త్‌ను అభివ‌ర్ణించారు. ఇండో-ప‌సిఫిక్‌ ప్రాంతంలో ఆ దేశాన్ని లీడ‌ర్‌గా చూస్తామ‌ని చెప్పారు. క్వాడ్‌లో భార‌త్ చోద‌క శ‌క్తి (డ్రైవింగ్ ఫోర్స్‌)గా ఉంటుంద‌ని అన్నారు. ప్రాంతీయ అభివృద్ధిలోనూ భార‌త్ పాత్ర కీల‌కం అవుతుంద‌ని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/