భారత్‌, చైనా మధ్య కుదిరిన పరస్పర అంగీకారం

రెండ‌వ సైనిక చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దంగా సాగిన‌ట్లు పేర్కొన భార‌త ఆర్మీ

India-demands-pre-May-2-status-quo-at-LAC-in-meeting-with-China

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల విషయంలో భారత్, చైనా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు దేశాల సైనికుల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు త‌గ్గించేందుకు ప‌ర‌స్ప‌ర‌ ఏకాభిప్రాయం కుదిరిన‌ట్లు ఆర్మీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. గాల్వ‌న్ లోయలో ఘ‌ర్ష‌ణ జ‌రిగిన త‌ర్వాత సోమ‌వారం రెండ‌వ సారి లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ స్థాయి సైనిక చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఉద‌యం 11.30 నిమిషాల‌కు చైనా వైపున ఉన్న చూసుల్ సెక్ట‌ర్‌లోని మోల్డో వ‌ద్ద భేటీ జ‌రిగింది. అయితే ఆ చ‌ర్చ‌లు పాజిటివ్‌గా, స్నేహ‌పూర్వ‌కంగా సాగిన‌ట్లు ఇవాళ భార‌త ఆర్మీ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఈస్ట్ర‌న్‌ ల‌డ‌ఖ్‌లో ఉన్న ద‌ళాల ఉప‌సంహ‌ర‌ణ అంశంపై చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. జూన్ 6వ తేదీన కూడా ఇదే ప్రాంతంలో తొలి రౌండ్ సైనిక స‌మావేశాలు జ‌రిగాయి. కానీ ఆ చ‌ర్చ‌ల్లో జ‌రిగిన ఒప్పందాల‌ను చైనా సైనికులు ఉల్లంఘించారు. గాల్వ‌న్ న‌ది వెంట ఉన్న పెట్రోలింగ్ పాయింట్ల నుంచి వాళ్లు జ‌ర‌గలేదు. దీంతో రెండు దేశాల సైనికుల మ‌ధ్య జూన్ 15వ తేదీన ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఆ గొడ‌వ‌ల్లో క‌ల్న‌ల్ సంతోష్‌బాబుతో పాటు మ‌రో 20 మంది సైనికులు వీర‌మ‌ర‌ణం పొందారు.


గ‌త వారం రోజుల నుంచి ఫార్వ‌ర్డ్ స్థావ‌రాల‌కు భారీ స్థాయిలో ద‌ళాల‌ను మోహ‌రిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. చైనాతో ఉన్న సుమారు 3500 కిలోమీట‌ర్ల స‌రిహ‌ద్దు వెంట ఉన్న సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్న‌ట్లు కూడా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. సుఖోయ్ 30, జాగ్వార్‌, మిరాజ్‌2000 లాంటి యుద్ధ విమానాల‌ను వాయుసేన ల‌డ‌ఖ్‌కు త‌ర‌లించింది. లేహ్‌, శ్రీన‌గ‌ర్ ఎయిర్‌బేస్‌ల్లో అపాచీ హెలికాప్ట‌ర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/