మే వరకు వేచి చూదాం!

India , America
India , America

ఢిల్లీ: అమెరికా ఉత్పత్తులపై పన్ను విధించే విషయంలో భారత్‌ వేచి చూసే ధోరణి కొనసాగిస్తుంది. ఈ సందర్భంగా మే 2వ తేదీ వరకు వేచి చూడాలని ప్రభుత్వం నిర్ణయించికుంది. అయితే దీంతో 29 రకాల అమెరికా వస్తువలకు మరికొంత కాలం ఉపశమనం లభించనుంది. నిజానికి కొత్త టారీఫ్‌లు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమలు కావాల్సి ఉంది. ఇప్పటికే జూన్‌ 2018 నుంచి దాదాపు డజను సార్లు ఈ మినహాయింపును పొడిగించుకుంటూ వచ్చింది. అమెరికా విధించిన పన్నులకు ప్రతిగా భారత్‌ కూడా పన్నులు విధించాలని నిర్ణయించింది. కానీ, భారత్‌ ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతినకుండా వేచి చూసే ధోరణి కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత అధికారులు కూడా అమెరికా అధికారులతో చర్చలు జరుపుతున్నారు. కానీ అదే సమయంలో గత నెల భారత్‌కు జీఎస్‌పీ హోదాను రద్దు చేస్తూ అమెరికా నిర్ణయం తీసుకొంది. దీంతో భారత్‌ నుంచి అమెరికా వెళ్లే దాదాపు 5.6బిలియన్‌ డాలర్ల సరుకులపై ప్రభావం పడనుంది. దాదాపు 1,900 వస్తువులు దీని పరిధిలోకి వస్తాయి. ముఖ్యంగా కెమికల్‌, ఇంజినీరింగ్‌ రంగాలు ప్రభావితం కానున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చేనెల భారత అధికారుల బృందం అమెరికా వెళ్లి చర్చలు జరపనుంది. ముఖ్యంగా స్టీల్‌, అల్యూమినియం ఉత్పత్తులపై భారీగా పన్నులు విధించడాన్ని భారత్‌ వ్యతిరేకిస్తోంది. భారత మార్కెట్లోకి అమెరికా చొచ్చుకువచ్చే విధంగా నిబంధనలు ఉండాలని అగ్రరాజ్యం కోరుకుంటోంది. వ్యవసాయరంగం, పాలఉత్పత్తులు, వైద్య పరికరాలు, కమ్యూనికేషన్స్‌ వస్తువలపై పన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరుకుంటోంది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/