టీమ్‌ఇండియా అద్భుత విజయం

•3 వికెట్ల తేడాతో ఆసీస్ పరాజయం
•89 పరుగులతో అజేయంగా నిలిచిన పం త్
•328 పరుగుల విజయలక్ష్యాన్ని 7 వికెట్లకు ఛేదించిన భారత్
•2-1తో సిరీస్ టీమిండియా కైవసం

బ్రిస్బేన్‌: బ్రిస్బేన్‌ టెస్టులో టీమ్‌ఇండియా అద్భుత విజయం సాధించింది. సొంతగడ్డపై ఆడుతున్న ఆస్ట్రేలియా గర్వం అణిచేలా 3 వికెట్ల తేడాతో టెస్టును, తద్వారా 21 తేడాతో 4 టెస్టుల సిరీస్ ను కైవసం చేసుకుంది. 328 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ చివరి వరకు క్రీజులో నిలిచి భారత్ ను గెలుపు తీరాలకు చేర్చాడు. చివర్లో పంత్ బౌండరీతో విన్నింగ్ షాట్ కొట్టగానే టీమిండియా ఆటగాళ్లలో విజయానందం ఉప్పొంగింది. పంత్ 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ కు 4, స్పిన్నర్ నేథన్ లైయన్ కు 2 వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పంత్ నే వరించింది. ఈ సిరీస్ లో 21 వికెట్లు తీసిన ఆసీస్ పేసర్ ప్యాట్ కమ్మిన్ కు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు లభించింది.

అంతకుముందు, 4/0 ఓవర్ నైట్ స్కోరుతో చేజింగ్ కొనసాగించిన భారత్ ఇవాళ ఉదయం ఆదిలోనే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. అయితే, శుభ్ మాన్ గిల్, ఛటేశ్వర్ పుజారా జోడీ అద్భుత భాగస్వామ్యంతో భారత్ ను గెలుపు బాటలో నిలిపింది. గిల్ 91 పరుగులు చేయగా, పుజారా 56 పరుగులు సాధించాడు. కెప్టెన్ రహానే (24) కూడా వెనుదిరిగినా పంత్ మాత్రం మొండిపట్టుదలతో క్రీజులో పాతుకుపోయాడు. పంత్ కు వాషింగ్టన్ సుందర్ నుంచి చక్కని సహకారం లభించింది. సుందర్ 29 బంతుల్లో 2 ఫోర్లు ఒక సిక్స్ తో 22 పరుగులు సాధించాడు. పంత్ స్కోరులో 9 ఫోర్లు, ఒక సిక్సు ఉన్నాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/