బ్రిటన్ పార్లమెంట్లో రైతుల నిరసనలపై చర్చ.. ఖండించిన భారత్
India condemns one-sided false assertions in UK parliamentary debate over farmers’ protest
లండన్: భారత్లో జరుగుతున్న రైతు నిరసనలపై సోమవారం రోజున బ్రిటీష్ పార్లమెంట్లో చర్చ చేపట్టారు. బ్రిటన్ ఎంపీలు ఈ అంశాలపై చేపట్టిన చర్చను లండన్లో ఉన్న భారతీయ హై కమీషన్ తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో హై కమీషన్ పత్రికా ప్రకటనను రిలీజ్ చేసింది. చర్చ సరైన రీతిలో సమతుల్యంగా జరగలేదని, తప్పుడు ఆరోపణలతో చర్చించారని, తమ వాదనలకు ఎటువంటి ఆధారాలు లేవని, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంపై అనుచిత ఆరోపణలు చేస్తున్నారని, భారత వ్యవస్థలను తప్పుగా చిత్రీకరిస్తున్నారని హై కమీషన్ తన లేఖలో పేర్కొన్నది. విదేశీ మీడియాతో పాటు బ్రిటీష్ మీడియా కూడా ఇండియాలో ఉన్నదని, భారత్లో పత్రికా స్వేచ్ఛ లేదన్న అంశం ఏ రకంగా ఉత్పన్నంకాదు అని భారతీయ హై కమీషన్ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
కాగా, సోమవారం రోజున బ్రిటీష్ పార్లమెంట్ సుమారు 90 నిమిషాలు భారత్లో జరుగుతున్న రైతు నిరసనలపై చర్చించింది. అలాగే ఇండియాలో ఉన్న ప్రెస్ ఫ్రీడం అంశాన్ని కూడా చర్చించారు. రైతు నిరసనల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును లేబర్ పార్టీ, లిబరల్ డెమోక్రాట్స్, స్కాటిష్ నేషనల్ పార్టీ ఎంపీలు ఖండించారు. త్వరలో ప్రధాని మోడీతో బ్రిటన్ ప్రధాని కలుసుకుంటారని, ఆ సమయంలో రైతు నిరసనల అంశాన్ని లేవనెత్తుతామని బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది. భారత సంతతికి చెందిన లిబరల్ డెమోక్రాట్ నేత గుర్చ్ సింగ్ వేసిన పిటిషన్ ఆధారంగా బ్రిటన్ పార్లమెంట్లో చర్చ చేపట్టారు. ఆ పిటిషన్పై బ్రిటన్లో ఉన్న స్థానికుల నుంచి లక్షల సంఖ్యలో సంతకాలు సేకరించారు.
తాజా వీడియోస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/