ట్విట్టర్‌ కొత్త సీఈ‌వోగా పరాగ్‌ అగ‌ర్వాల్‌

బాధ్యతల నుంచి తప్పుకున్న ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే

న్యూయార్క్‌: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే నిన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఈవో పదవికి గుడ్‌బై చెప్పేశారు. భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ (45) కొత్త సీఈవోగా నియమితులయ్యారు. అగర్వాల్ ప్రస్తుతం ట్విట్టర్ చీఫ్ టెక్నాలజీ ఆఫసర్ (సీటీవో)గా ఉన్నారు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ ఇంజినీరింగ్, స్టాన్‌ఫోర్డ్‌లో పీహెచ్‌డీ చేసిన అగర్వాల్ తన తాజా నియామకంపై మాట్లాడుతూ.. ఈ పదవిని చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. డోర్సే మార్గదర్శనం, స్నేహం కొనసాగుతుందని భావిస్తున్నట్టు ఆశిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

పరాగ్ నియామకంపై డోర్సే మాట్లాడుతూ.. పరాగ్‌ను ఏకగ్రీవంగా ఎంచుకున్నట్టు చెప్పారు. కంపెనీ అవసరాలను అతడు లోతుగా అర్థం చేసుకున్నాడని, ట్విట్టర్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనక అతడు ఉన్నాడని పేర్కొన్నారు. పరాగ్‌లో ఆసక్తి, హేతుబద్ధత, సృజనాత్మకత, వినయం అన్నీ ఉన్నాయని అన్నారు. సీఈవోగా ఆయనపై తనకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. కాగా, సీఈవో పదవి నుంచి తప్పుకున్న డోర్సే 2022లో పదవీ కాలం ముగిసేంత వరకు ట్విట్టర్ బోర్డులోనే కొనసాగుతారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/