భారత్ పై యూఎస్ శాస్త్రవేత్త పొగడ్తలు

ప్రపంచం మొత్తానికే ఓ ఔషధ కేంద్రంగా సేవలు… పీటర్ హూటెజ్

అమెరికా : ప్రపంచ ఫార్మా సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పరచుకుని, కరోనా టీకాను పెద్దఎత్తున తయారు చేస్తూ, విదేశాలకు అందిస్తున్న భారత్, మహమ్మారి నుంచి ప్రపంచాన్ని రక్షిస్తోందని అమెరికా శాస్త్రవేత్త ఒకరు పొగడ్తల వర్షం కురిపించారు. కరోనా సమయంలో ప్రపంచం మొత్తానికే ఓ ఔషధ కేంద్రంగా భారత్ మారిపోయిందని నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ డీన్ డాక్టర్ పీటర్ హోటెజ్ వ్యాఖ్యానించారు. తాజాగా ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ గ్రేటర్ హూస్టన్ ఆధ్వర్యంలో జరిగిన వెబినార్ లో పాల్గొన్న ఆయన, రెండు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ లు స్వల్ప, మధ్యాదాయ దేశాలకు వరంగా మారాయని అన్నారు.

కరోనా వ్యాక్సిన్ ను తమకు సరఫరా చేయాలని ఇండియాను ఆశ్రయిస్తున్న దేశాల సంఖ్య పదులను దాటి వందల్లోకి వెళుతోందని, ఆ దేశంలోని ఫార్మా ఇండస్ట్రీ ప్రపంచానికి ఎంతో సేవ చేస్తోందని అన్నారు. ఎంత భారీగా వ్యాక్సిన్ వయల్స్ ప్రపంచానికి అందితే, అంత వేగంగా తిరిగి సాధారణ స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేసిన ఆయన, ఈ లక్ష్య సాధనకు ఇండియా అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. భారత్ లోని తన సహచరులతో తరచూ వివిధ అంశాలపై తాను చర్చలు జరుపుతూనే ఉంటానని గుర్తు చేసుకున్న హోటెజ్, ఈ సమావేశం తనకెంతో ప్రత్యేకమైనదని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/